ప్రతి సినిమా `కేజీఎఫ్` కావాలంటే ఎలా?
బాక్సాఫీస్ వద్ద కొన్ని సినిమాలు ట్రెండ్ సెట్టర్స్ గా నిలుస్తుంటాయి..అయితే అలాంటి సినిమాలనే ఫాలో అవుతూ వరుసగా కొత్త కథలతో సినిమాలు పుట్టుకొస్తూ వుండటం తెలిసిందే. ట్రెండ్ సెట్టర్ సినిమాలని స్ఫూర్తిగా తీసుకుని సరికొత్త కథలని వెండితెరపై ఆవిష్కరించడంలో తప్పులేదు కానీ ట్రెండ్ సెట్టర్ లనే యాజిటీజ్ గా కాపీ చేయాలని, అదే సక్సెస్‌లని తామూ సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం మొదటికే మోసం జరిగే ప్రమాదం వుంది. కన్నడలో రూపొందిన పాన్ ఇండియా మూవీ `కబ్జ` విషయంలో సరిగ్గా ఇదే జరిగింది.
ఉపేంద్ర కథానాయకుడిగా నటించిన మూవీ `కబ్జ`. శివరాజ్ కుమార్, కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటించారు. 120 కోట్ల బడ్జెట్ తో ఆర్. చంద్రూ ఈ సినిమాని భారీ స్థాయిలో తెరపైకి తీసుకొచ్చారు. టీజర్ విడుదలైన సమయంలోనే `కేజీఎఫ్`కు కాపీలా వుందంటూ విమర్శలు వినిపించాయి. ట్రైలర్ రిలీజ్ తరువాత ఇది `కేజీఎఫ్`కు పక్కా కాపీ అన్న కామెంట్‌లు ఎక్కువయ్యాయి. కాకపోతే సినిమాలో మరేదైనా విషయం వుందేమోనని అంచనా వేశారు.
మార్చి 17న పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా ఈ సినిమాని విడుదల చేశారు. తెలుగులో ఈ మూవీని చూసిన ఆడియన్స్ `కేజీఎఫ్` ప్రింట్ ని పక్కన పెట్టుకుని సీన్ టు సీన్ కాపీ చేసి ఈ సినిమా కథని రాసుకున్నట్టుగా వుందని మండిపడుతున్నారు. సినిమా బడ్జెట్ వంద కోట్లకు పైనే వుండటంతో కాపీ సినిమా చేయడం కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలా? అని పెదవి విరుస్తున్నారు. సినిమా చూస్తున్నంత సేపు ప్రతీ సీన్, ప్రతీ షాట్ `కేజీఎఫ్`ని గుర్తు చేస్తుండటంతో `కబ్జ` ఓ కాపీ సినిమా.. కేజీఎఫ్ ను కబ్జా చేసేశారంటూ మేకర్స్ పై విమర్శలు చేస్తున్నారు.
ఉపేంద్రకు హీరోగా ఓ స్టైల్ వుంది. తను చేసిన `ఏ`, ఉపేంద్ర`, `రా`, H2O వంటి సినిమాలు తెలుగులోనూ బాగానే ఆదరించారు. తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న ఉపేంద్ర అన్నీ తెలిసి `కేజీఎఫ్`కు కాపీ లాంటి `కబ్జ`ని ఎలా అంగీకరించారని ఆయనని అభిమానించే తెలుగు ప్రేక్షకులు వాపోతున్నారు. సినిమాలో బలమైన పాయింట్ లేదు, ఎంచుకున్న కథ, కీలక సన్నివేశాలు.. బ్యాగ్రౌండ్ స్కోర్, డార్క్ కలర్ థీమ్ ..ఇలా ప్రతీదీ `కేజీఎఫ్`ని గుర్తు చేస్తుండటంతో `కబ్జ` ఓ డూప్లికేట్ సినిమా అని ఆడియన్స్ కన్ఫమ్ చేసేశారు.
ఇక కన్నడ ఇండస్ట్రీ నుంచి సైలెంట్ గా విడుదలై మోన్ స్టర్ లా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మూవీ `కేజీఎఫ్ చాప్టర్ 2`. కేజీఎఫ్ సిరీస్ లో భాగంగా యష్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి కన్నడ ఇండస్ట్రీని వార్తల్లో నిలిచేలా చేసింది. ప్రస్తుతం ప్రభాస్ తో `సలార్`ని రూపొందిస్తున్న ప్రశాంత్ నీల్ త్వరలో `కేజీఎఫ్ చాప్టర్ 3`ని కూడా తెరపైకి తీసుకురాబోతున్నారు. త్వరలో ఈ సీక్వెల్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.