NTR Centenary:విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు గత ఏడాది మే 28న ప్రారంభమైన విషయం తెలిసిందే.
NTR Centenary:విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు గత ఏడాది మే 28న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఏడాది పాటు ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహించాలని నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఇందు కోసం టి.డి.జనార్ధన్ ఛైర్మన్‌గా ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల విజయవాడలోని పోరంకి గార్డెన్లో ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పాల్గొన్నారు.
మే 20న హైదరాబాద్, కూకట్ పల్లి కెపీహెచ్బిలోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌పై ప్రత్యేక వెబ్ సైట్‌ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ టాప్ స్టార్స్ పవన్ కల్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, వెంకటేష్, రామ్ చరణ్‌లతో పాటు స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పాల్గొంటారని వార్తలు వినిపించాయి. ఉత్సవాల కమిటీ ఛైర్మన్ జనార్థన్ ప్రత్యేకంగా ఎన్టీఆర్‌కు ఆహ్వానం కూడా అందించారు.
అయితే తాజాగా ఆయన శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం లేదని తెలిసింది. శనివారం ఉత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే అదే రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఆ ఆకారణంగానే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం లేదని తెలిసింది. ఈ విషయాన్ని నిర్వాహకులు తాజాగా వెల్లడించారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఇదే రోజు ఉండటం, ఫ్యామిలీతో గడపాలని ఎన్టీఆర్ భావించారని, ఆ కారణంగానే ఆయన ఈ వేడుకల్లో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు.
దీంతో తారక్ అభిమానులతో పాటు ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారట. జూ.ఎన్టీఆర్ శత జయంతి వేడులలో పాల్గొంటే చూడాలని, వేదికపై టాలీవుడ్ స్టార్స్‌తో పాటు బాబాయ్ నందమూరి బాలకృష్ణతో ఎన్టీఆర్ కలిసి మాట్లాడితే చూడాలని ఎంతగానో ఆశపడ్డారని,. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ అభిమానులు ఫీలవుతున్నారు. ఇదిలా ఉంటే కొంత కాలంగా నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్‌కు మధ్య దూరం పెరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.
నందమూరి బాలకృష్ణ కూడా ఎన్టీఆర్‌ను దూరం పెడుతున్నారని, ఆ కారణంగానే ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొనడం లేదని ప్రచారం జరుగుతోంది. నందమూరి కల్యాణ్ రామ్ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారా? లేక తమ్ముడు ఎన్టీఆర్ బర్త్‌డే వేడుకలకు ప్రాధాన్యత ఇస్తారా? అన్నది తెలియాలంటే మరి కొన్ని గంటల్లో జరగనున్న ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు స్పష్టతనిచ్చే అవకాశం ఉందని ఇండస్డ్రీ వర్గాల్లో వినిపిస్తోంది.