OTT Market in India: ఇండియన్ ఓటీటీ మార్కెట్ లో ఎవరి వాటా ఎంతో తెలుసా?
Indian OTT Market trends
భారతదేశంలో ఓటీటీ మార్కెట్ శరవేగంగా పెరుగుతోంది. కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి. కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాయి. అదే స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయి. ఈ మార్కెట్ రానున్న కాలంలో మరింత విస్తరించనుందని అనేక మీడియా సర్వేలు చెబుతున్నాయి. 2027 నాటికి భారత ఓటీటీ మార్కెట్ 7 బిలియన్ల డాలర్లకు చేరనున్నట్లు మీడియా పార్టనర్స్ ఏషియా అనే సంస్థ వెల్లడించింది.
అంతర్జాతీయ ఓటీటీ సంస్థలు ఇండియాలో ఓటీటీ మార్కెట్ ఏ విధంగా ఉంటుందో ముందే గ్రహించాయి. చాలా కాలం క్రితమే భారతదేశంలో రంగ ప్రవేశం చేశాయి. భారత ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందిస్తూ స్ట్రీమింగ్ చేస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్, అమేజాన్, హాట్ స్టార్ సంస్థలు భారత ఓటీటీ మార్కెట్ లో అత్యధిక షేర్ కలిగి ఉన్నాయి.
అంతర్జాతీయ ఓటీటీ సంస్థలతో పోటీ పడుతూ ఇండియన్ ఓటీటీ సంస్థలు కూడా శరవేగంగా రేసులో వచ్చాయి. వీక్షకులను కట్టిపేడేసే కంటెంట్ తో కొత్త కొత్త సినిమాలను, వెబ్ సిరీస్ లను రూపొందిస్తున్నాయి.
భారతదేశపు జనాభాలో సెల్ ఫోన్ల వాడకం, ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరగడం ఓటీటీ మార్కెట్ విస్తరణకు బాటలు వేసింది. రానున్న రోజుల్లో సెల్ ఫోన్ల వాడకం మరింత పెరిగే అవకాశం ఉన్నందున మార్కెట్ విస్తరణ కూడా అదే స్థాయిలో జరగనుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
భారతదేశపు ఓటీటీ మార్కెట్ లో డిస్నీ హాట్ స్టార్ దే పై చేయిగా కనిపిస్తోంది. ఆ సంస్థ స్ట్రీమింగ్ చేస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు లక్షలాది మందిని కట్టిపడేస్తున్నాయి. దీంతో ఆ సంస్థకు భారతదేశంలో 42 మిలియన్లకు పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. డిస్నీ హాట్ స్టార్ తర్వాతి స్థానంలో అమేజాన్ ప్రైమ్ నిలిచింది. అమేజాన్ కు భారత దేశంలో 21 మిలియన్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారు.
మూడవ స్థానంలో సోనీ లివ్ సంస్థ ఉంది. ఆ సంస్థకు 12 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. భారత ఓటీటీ మార్కెట్ లో జీ 5 సంస్థ నాల్గవ స్థానాన్ని సంపాదించింది. ఆ సంస్థకు 7.5 మిలియన్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇక నెట్ ఫ్లిక్స్ సంస్థ ఓటీటీ మార్కెట్ లో వెనకబడి ఉంది. భారత దేశంలో నెట్ ఫ్లిక్స్ సంస్థకు 5,5 మిలియన్ల సబ్ స్క్రైబర్లు మాత్రమే ఉన్నారు.
భారతదేశంలో వివిధ ఓటీటీలు అందిస్తున్న కార్యక్రమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే దేశంలో 10 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్ వినియోగం పెరగడం, సెల్ ఫోన్ల వినియోగం పెరగడం ద్వారా ఓటీటీ సబ్ స్క్రైబర్ల సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరగనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.