Sankranthi Movies: అభిమానులే డైరెక్టర్లుగా మారితే.. రిజల్ట్ ఇలా ఉంటుంది
If Fans Become Directors.. The Result Will Be Like This: ఒక హీరో ఎలా ఉండాలి అనేది ఒక అభిమానికి మాత్రమే తెలుస్తోంది. తమ అభిమాన హీరో సినిమా అని థియేటర్ కు వెళ్లి.. అక్కడ సినిమా బాగోకపోతే నిరాశగా బయటికి వచ్చి.. సినిమా బాగోలేదని బయటికి చెప్పలేక, బావుంది అని చెప్పుకొంటూ తిరిగే అభిమానులు ఎంతోమంది. అసలు హీరో సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షోకు వెళ్లనివాడు వీరాభిమానియే కాదు అనుకోనేవారు మరికొంతమంది. ఏదిఏమైనా ఒక హీరో నుంచి అభిమానులు ఏం కోరుకుంటున్నారు.. ఎలా చూడాలనుకుంటున్నారు అనేది మరో అభిమానికే తెలుస్తోంది. ఆ అభిమానినే ఒక డైరెక్టర్ అయ్యి.. తమ అభిమానులు తమ హీరోను ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తే.. వచ్చినవే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు.
గోపీచంద్ మలినేని.. క్రాక్ సినిమాతో గతేడాది రవితేజకు మంచి హిట్ ను అందించాడు. మాస్ యాక్షన్ తీయడంలో గోపీచంద్ దిట్ట. మొదటి నుంచి గోపీచంద్.. నందమూరి బాలకృష్ణ వీరాభిమాని. ఆయన సినిమా మొదటిరోజు మొదటి షో చూడడం కోసం పోలీసుల చేత దెబ్బలు తిని, జైలుకు వెళ్లిన చరిత్ర గోపీచంద్ మలినేనిది. నిజంగా చెప్పాలంటే.. బాలకృష్ణ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోనే గోపీచంద్ డైరెక్టర్ గా మారాడు. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా..? అని ఎదురుచూసిన తరుణం వీరసింహారెడ్డి సినిమాతో ఇన్నాళ్లకు నిజమైంది. ఒక అభిమానిగా బాలకృష్ణను ఎలా అభిమానులు చూడాలనుకున్నారో అలాంటి సినిమాతోనే వచ్చాడు. బాలయ్య సస్టైల్, యాక్షన్, పంచ్ డైలాగ్ లు, స్టెప్పులు.. ఆ రాజసం, ఠీవి అన్నింటిని మిక్స్ చేసి వీరసింహారెడ్డి గా అభిమానుల ముందు ఉంచాడు. థియేటర్ లో జై బాలయ్య స్లొగన్స్ ను పర్మినెంట్ గా ఒక పాట రూపం లో తీసుకొచ్చేసాడు. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా దుమ్ము రేపుతోంది.
చిరంజీవికి అభిమాని అని చెప్పడం కన్నా వీరాభిమాని.. కాదు ఒక భక్తుడు అని బాబీని చెప్పొచ్చు. చిరుతో కలిసి ఒక ఫోటో దిగితే చాలు జన్మ ధన్యమైపోతోంది అనుకున్న ఒక కుర్రాడు.. పదేళ్ల తరువాత అదే చిరును డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. చిన్నతనం నుంచి చిరు సినిమాలను చూస్తూ పెరిగిన బాబీ.. చిరును కలవడానికే హైదరాబాద్ ట్రైన్ ఎక్కాడు. ఒక వేడుకలో చిరుతో ఫోటో దిగడానికి తడబడుతూ వచ్చిన బాబీ.. చిరు నవ్వుతూ ఉన్నప్పుడు ఫోటో దిగాలని ఆశపడి ఆయన కోపానికి కారణమయ్యాడు. ఇక ఇదంతా కాదు.. ఎప్పటికైనా ఆయనతో నవ్వుతు ఫోటో దిగడం కోసం మొదలు పెట్టిన జర్నీ.. అతడిని డైరెక్టర్ గా మార్చింది. రవితేజ, పవన్ కళ్యాణ్.. చివరికి చిరంజీవి తో సినిమా.. ఈ సినిమా జర్నీలో బాబీ ఎన్నో కోల్పోయాడు. తన ప్రాణానికి ప్రాణమైన తండ్రి చనిపోయి మూడు రోజులే అయినా కన్నీళ్లను దిగమింగుకొని షూటింగ్ చేసాడు బాబీ. అందుకు కారణం తన తండ్రి చెప్పిన మాట.. చిరుతో సినిమా తీసే అవకాశం వచ్చినప్పుడు.. మిగతావి ఏవి పట్టించుకోకూడదని ఆయన బెడ్ మీద ఉన్నప్పుడే చెప్పినట్లు చెప్పుకోచ్చాడు. ఒక అభిమానిగా అంతకు మించిన ఘనత మరొకటి ఉండదని తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చి సెట్ కు వెళ్లినట్లు తెలిపాడు. ఇక ఒక అభిమాని గా చిరును ఎలా చూపించాలో అంతకు మించి చూపించి మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు. ఇప్పటివరకు ఏ డైరెక్టర్ కలపని మరోకాంబో ను అభిమానులకు చూపించాడు. ఇద్దరు స్టార్ హీరోలు చిరు, రవితేజను ఒకే ఫ్రేమ్ లో కనిపించేలా చేసిన ఘనత బాబీకే చెల్లుతోంది. ప్రస్తుతం ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది.
హీరోలను అభిమానులు ఎలా కోరుకుంటున్నారో అలా చూపించిన ఈ అభిమాన డైరెక్టర్లు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని ఎన్టీఆర్ చెప్పిన మాటలనే.. కస్టపడి పనిచేసి.. ఒక గోల్ తో ముందు వెళ్తే సాధించలేనిది ఏది లేదని ఈ డైరెక్టర్లు నిరూపించారు. ప్రస్తుతం థియేటర్లో చూసే చాలామంది అభిమానులు.. ఇదే కలతో ఉండి ఉండొచ్చు.. భవిష్యత్తులో తమ అభిమాన హీరోను డైరెక్ట చేసే ఛాన్స్ ను కొట్టేయొచ్చు. మరి.. ఆ వీరాభిమాని డైరెక్టర్లు ఎవరో కాలమే నిర్ణయించాలి.