దసరా..15 నిమిషాలకు అన్నికోట్లా?
తెలుగులో ఇప్పుడు ప్రతీ హీరో పాన్ ఇండియా మూవీ జపమే చేస్తున్నారు. తమ ఇమేజ్ తో పాటు మార్కెట్ స్థాయిని పెంచుకోవడానికి పాన్ ఇండియా సినిమాలు మెయిన్ వెపన్ గా మారడంతో యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా మంత్రమే పఠిస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా చేరిపోయాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా `దసరా`. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
హీరో నాని తన స్టైల్ కు పూర్తి ఢిఫరెంట్ గా ఊర మాస్ లుక్ లో పక్కా పల్లెటూరి తెలంగాణ యువకుడిగా నటిస్తున్న సినిమా ఇది. మార్చి 30న ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతోంది. ఇప్పటికే నాని మార్కెట్ కు మించి ఈ చిత్రం కోసం 70 కోట్ల వరకూ ఖర్చు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. హీరోగా నాని కెరీర్ లో ఇదే ఎక్కువ బడ్జెట్ ఉన్న మూవీ. ఇదిలా వుంటే ఈ సినిమా క్లైమాక్స్ కోసం మేకర్స్ ఏకంగా 5 కోట్లు ఖర్చు చేశారనే టాక్ వినిపిస్తోంది. సినిమాలో క్లైమాక్స్ కేవలం 15 నిమిషాలే. ఆ పదిహేను నిమిషాల సన్నివేశాల కోసం మేకర్స్ ఐదు కోట్లు ఖర్చు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
కంటతడి పెంట్టించే భావోద్వేగ సన్నివేశాలు, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ ఘట్టాలు, ఓ భారీ సెట్, భారీ స్థాయిలో జూనియర్ ఆర్టిస్ట్ లు.. 15 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్.. దీని కోసం ఐదు కోట్ల బడ్జెట్ ని మేకర్స్ ఖర్చు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సినిమా ప్రారంభం నుంచి హీరో నాని, కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఏ చిన్న విషయాన్ని కూడా లైట్ తీసుకోవడం లేదు.
కథకు ఏది అవసరం అనుకుంటే దాని విషయంలో ఖర్చుకు వెనకాడకుండా క్వాలిటీ కోసం కాంప్రమైజ్ కావడం లేదు. నాని తెలంగాణ యాస డబ్బింగ్ విషయంలోనూ ఇప్పటికీ చిన్న చిన్న కరెక్షన్స్ చేస్తున్నారట. దీంతో అనుకున్న బడ్జెట్ కాస్తా పెరిగిపోతోందని ఇన్ సైడ్ టాక్. బడ్జెట్ పెరిగినా పాన్ ఇండియా వైడ్ గా మార్కెట్ చేసుకునే వీలుంది కాబట్టి మేకర్స్ ఈ ప్రాజెక్ట్ పై వున్న నమ్మకంతో ఖర్చు విషయంలో కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది. గోదావరి ఖని సమీపంలోని ఈర్లపల్లిలో జరిగిన ఓ యదార్ధ కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ మిక్సింగ్ చెన్నైలో జరుగుతోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో హీరో నాని మాసీవ్ లుక్ లో కనిపిస్తుండగా, హీరోయిన్ కీర్తి సురేష్ డీ గ్లామర్ పాత్రల్లో నటించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచేయడంతో నాని కూడా ఈ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారట.