Music director raj:టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్(Music director raj)(68) కన్నుమూశారు.
Music director raj:టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్(68) కన్నుమూశారు. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం నివాసంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. కూకట్పల్లి లోని ఆయన నివాసంలో కన్నుమూశారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలున్నారు. పెద్దమ్మాయి దీప్తి, రెండో అమ్మాయి పేరు దివ్య, మూడవ అమ్మాయి పేరు శ్వేత. రెండో అమ్మాయి సినిమా ఇండస్ట్రీలో దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తోంది.
మూడవ అమ్మాయి శ్వేత మలేషియాలో ఉంటోంది. తను సోమవారం హైదరాబాద్ చేరుకోనుంది. అదే రోజు మహా ప్రస్థానంలో రాజ్ అంత్య్రక్రియలు జరగనున్నాయి. రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు..కోటితో కలిసిఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించి యువతను ఉర్రూతలూగించారు. దశాబ్దాల కాలం పాటు సంగీత ద్వయం సినీ ప్రయులను తమదైన మార్కు సంగీతంతో అలరించింది. రాజ్ మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రాజ్ మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
రాజ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 1983లో విడుదలైన `ప్రళయ గర్జన`కు తొలిసారి రాజ్ – కోటి కలిసి సంగీతం అందించారు. ఆ తరువాత రాజ్.. కోటితో కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాలకు తమదైన సంగీతాన్ని అందించి తమ పాటలతో విజయాల్ని చేకూర్చారు. యముడికి మొగుడు, లంకేశ్వరుడు, కొదమసింహం, ముఠామేస్త్రీ, ఖైదీ నెం.786, త్రినేత్రుడు, బాల గోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, టైటౌన్ రౌడీ, బజారు రౌడీ, విక్కీ దాదా, మెకానిక్ అల్లుడు, నిప్పు రవ్వ, గోవిందా గోవింద వంటి సినిమాలకు కలిసి సంగీతం అందించారు.
ఇప్పటికీ ఈ సినిమాల్లోని పాటలు యూత్‌ని వెంటాడుతూనే ఉన్నాయి. హిందీ సినిమాలకు కూడా కలిసి దాదాపుగా 150 చిత్రాలకు సంగీతం అందించిన రాజ్ కోటీ ఆ తరువాత విడిపోయారు. కోటి సోలోగా వరుస హిట్లని అందిస్తే రాజ్ మాత్రం ఆ స్థాయిలో సూపర్ హిట్లని, క్రేజీ స్టార్ల సినిమాలని సొంతం చేసుకోలేకపోయారు. సోలోగా `సిసింద్రీ, రాముడొచ్చాడు, ప్రేమంటే ఇదేరా(నేపథ్య సంగీతం మాత్రమే) వంటి చిత్రాలకు పని చేశారు. ఆ తరువాత సంగీత దర్శకుడిగా కొనసాగలేకపోయారు. రాజ్ ఒక్కడే చేసిన సినిమాల్లో నాగార్జున నటించిన నటించిన `సిసింద్రీ`, `రాముడొచ్చాడు`, వెంకటేష్ నటించిన `ప్రేమంటే ఇదేరా` (నేపథ్య సంగీతం అందించారు) మాత్రమే చెప్పుకోదగ్గవి. సంగీత దర్శకుడిగా సినిమాలు మానేసిన రాజ్ కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనిపించారు. రాజ్ తండ్రి తొటకూర వెంకట రాజు కూడా సంగీత దర్శకులే. పలు తెలుగు సినిమాలకు ఆయన సంగీతం అందించారు.
రాజ్ మృతి పట్ల కోటి తీవ్ర దిగ్భ్రాంతి
రాజ్ మృతి పట్ల కోటి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. `నేను చెన్నైలో ఉన్నాను. అరగంట క్రితం వార్త తెలిసి షాక్ కు గురయ్యాను. ఇలాంటి వార్త వింటానని అస్సలు ఊహించలేదు. ఈ మధ్య ఓ ఫంక్షన్లో ఇద్దరం కలిశాం. చాలా సేపు మాట్లాడుకున్నాం. రాజ్ ఆరోగ్యం బాగాలేదన్న విషయం నాకు ఈరోజే తెలిసింది. ఈ రోజు టిఫిన్ చేసి మందలు అన్నీ వేసుకున్నాడని, బాత్రూమ్లో జారిపడగానే రాజ్‌కు గుండెపోటు రావడంతో మృతి చెందాడని తెలిసింది. ఆ వార్త ఒక్కసారిగా షాక్ కు గురయ్యాను. దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇద్దరం కలిసి ఎంతో కష్టపడి రాజ్ -కోటీగా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించాం. అంతే కాకుండా చాలా సినిమాలకు సూపర్ హిట్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాం. నా రాజ్ లేకపోతే నా కుడి భుజం పపోయినట్టే. రాజ్‌తో నేను విడిపోయాక కోటిగా ఎన్ని సినిమాలు చేసి ఎంటర్ టైన్ చేసినా ..అవి రాజ్ కోటి పాటలే కానీ కోటి పాటలు మాత్రం కాదు..ఇద్దరం ఆ రోజుల్లో ఎంతో కష్టపడి ఛాలెంజింగ్‌గా తీసుకుని రాత్రింబవళ్లు పని చేశాం. మా భార్యలతో కంటే ఇద్దరమే ఎక్కువగా గడిపాం. అంటే రోజుకు ఇద్దరం రోజులో 20 గంటలు కలిసి పని చేశాం. చక్రవర్తిగారి దగ్గర అసిస్టెంట్స్‌గా పని చేసి ఎన్నో సినిమాలకు అద్భుతమైన పాటలు అందించాం. తెలుగులో మ్యూజిక్కు రాజ్, నేను సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేశాం. అలాంటి రాజ్ ఈ రోజు నాతో లేడంటే చాలా షాకింగ్‌గా ఉంది. మా పాటలతో, మేమిద్దరం అందించిన సంగీతంతో ప్రేక్షకుల హృదయాల్లో నా రాజ్ కలకాలం ఉంటాడు` అంటూ సంగీత దర్శకుడు కోటి కన్నీటి పర్యంతమయ్యారు.