Lyca productions:టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులపై ఇటీవల ఐటీ రైడ్స్ తీవ్ర కలకలం సృష్టించాయి.
Lyca productions:టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులపై ఇటీవల ఐటీ రైడ్స్ తీవ్ర కలకలం సృష్టించాయి. జీఎస్టీకి సంబంధించిన లెక్కలతో పాటు విదేశాల నుంచి వస్తున్న నిధుల విషయంలోనూ సదరు సంస్థ అవకతవకలకు పాల్పడిందని అధికారులు సంచలన ఆరోపణలు చేయడం, రూ.900 కోట్లు చేతులు మారాయని ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ సంఘటన మరవకముందే కోలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca productions)పై ఈడీ(ED) రైడ్స్ జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది.
లైకా ప్రొడక్షన్స్ కార్యాలయాల్లో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేపట్టింది. చెన్నైలోని లైకా కార్యాలయంతో సహా సంస్థకు చెందిన మొత్తం ఎనిమిది ప్రదేశాల్లో మంగళవారం ఉదయం నుంచి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. మనీలాండరింగ్ కు సంబంధించిన ఓ కేసులో ఈడీ వర్గాలు ఈ తనిఖీలు చేస్తున్నట్టుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ సోదాల నేపథ్యంలో లైకా వర్గాలు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
లైకా ప్రొడక్షన్స్‌ని శ్రీలంకకు చెందిన అల్లిరాజా సుబాస్కరన్ 2014లో ప్రారంబించారు. లైకా మొబైల్ లోని సబ్ గ్రూప్‌గా దీన్ని మొదలు పెట్టారు. ఈ సంస్థపై సినిమాల నిర్మాణంతో పాటు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు. సౌత్ ఇండియాతో పాటు అప్పుడప్పుడు హిందీలోనూ సినిమాలు నిర్మిస్తున్నారు. తొలి ప్రయత్నంగా విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో `కత్తి` చిత్రాన్ని నిర్మించారు. రీసెంట్గా మనిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పోన్నియిన్ సెల్వన్ 1`, `పొన్నియిన్ సెల్వన్ 2`లని నిర్మించి విడుదల చేశారు.
ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని సాధించి రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టాయి. ప్రస్తుతం ఈ సంస్థ కమల్‌తో `ఇండియన్ 2`, అరుణ్ విజయ్ తో `మిషన్ చాప్టర్ 2`, ఐశ్వర్య రజనీకాంత్‌తో `లాల్ సలామ్`, తల అజిత్ హీరోగా `విడా ముయార్చి` వంటి భారీ సినిమాలని నిర్మిస్తోంది. ఇవన్నీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థలపై ఈడీ దాడులు నిర్వహించడం కోలీవుడ్‌లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
ED conducts raids at LYCA Productions in Chennai. More details awaited: Sources pic.twitter.com/lZOX7pE9ks
— ANI (@ANI) May 16, 2023