Custody Movie: కస్టడీతో చైతూ ట్రాక్ లోకి రావడం ఖాయమేనా?
Will Naga Chaitanya come on Success track after Custody Movie
టాలీవుడ్ లో చాలా మంది హీరోలు సక్సెస్ ట్రాక్ లోకి రావాలని కొన్ని నెలలుగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆ జాబితాలో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య కూడా వున్నాడు. కొంత కాలంగా తన ఫ్యామిలీ ఇమేజ్ కు భిన్నంగా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తూ వస్తున్న నాగచైతన్య ఆ విషయంలో విఫలం అవుతూ వస్తున్నాడు. తొలి చిత్రం `జోష్`లోనే నటుడిగా తన ప్రొటెన్షియాలిటీ ఏంటో చూపించి ఆశ్చర్యపరిచాడు. అయితే ఆ తరువాత మాత్రం తన టాలెంట్ కి తగ్గ సినిమాలని చేయలేక రేసులో వెనకబడిపోతున్నాడు.
పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో కాకుండా క్లాస్, మాస్ అంశాలని మిక్స్ చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. ఈ ప్రయత్నంలో చేసిన `ఆటోనగర్ సూర్య` మిస్ ఫైర్ కావడంతో మళ్లీ తనదైన మార్కు క్లాస్ టచ్ వున్న రొమాంటిక్ లవ్ స్టోరీస్ తో కొంత కాలంగా కెరీర్ ని నెట్టుకొస్తున్నాడు. మేన మామ విక్టరీ వెంకటేష్ తో కలిసి `వెంకీ మామ` చేసినా, శేఖర్ కమ్ములతో కలిసి `లవ్ స్టోరీ` చేసినా అవి అతని కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేకపోయాయి.
గత ఏడాది రొమాంటిక్ మాస్ అంశాల స్టోరీగా తండ్రి నాగార్జునతో కలిసి చేసిన `బంగార్రాజు` ఫరావాలేదనిపించింది. ఇక `మనం` వంటి మెమరబుల్ ఫిల్మ్ ని అందించిన విక్రమ్ కె. కుమార్ తో కలిసి చేసిన `థ్యాంక్యూ` అడ్రస్ లేకుండా పోయింది. దిల్ రాజు నిర్మాణంలో చైతూ భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచి షాకిచ్చింది. ఇదే సమయంలో బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్‌తో కలిసి చేసిన `లాల్ సింగ్ చడ్డా` కూడా డిజాస్టర్ అనిపించుకోవడంతో చైతూ ఆలోచనలో పడ్డాడు. తన కెరీర్ ని ఒకసారి ఎనలైజ్ చేసుకున్న నాగచైతన్య ఫైనల్ గా మాస్ బాట పట్టాడు.
తన మార్కు సినిమాలకు పూర్తి భిన్నంగా మాస్, క్లాస్ అంశాలతో రూపొందుతున్న `కస్టడీ`లో నటిస్తున్నాడు. గత ఏడాది `మానాడు` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ మూవీని రూపొందిస్తున్నాడు. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ని రీసెంట్ గా విడుదల చేశారు. ఇందులో చైతూ పోలీస్ కానిస్టేబుల్ గా కనిపించబోతున్నాడు. నాగచైతన్యలోని మాస్ కోణాన్ని ఆవిష్కరిస్తూ ఈ మూవీని తెలుగు, తమిళ భాషలలో ద్విభాషా చిత్రంగా నిర్మించారు.
ఇది పూర్తి స్థాయి మాస్ ఎంటర్ టైనర్ కాకపొయినా క్లాస్ టచ్ తో సాగే యాక్షన్ డ్రామా కావడం, టీజర్ ఆసక్తికరంగా వుండటంతో నాగచైతన్య `కస్టడీ`తో సక్సెస్ ట్రాక్ లోకి రావడం ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. టీజర్ చూసిన అక్కినేని అభిమానులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ మూవీని మే 12న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. అక్కినేని ఫ్యాన్స్ ఊహలకు తగ్గట్టే నాగచైతన్య కస్టడీతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేస్తాడా? అన్నది తెలియాలంటే మే 12 వరకు వేచి చూడాల్సిందే.