ఆచార్యలో కాజల్ ను లేపేశారా?
హైదరాబాదులోని యూసఫ్ గూడా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు రాజమౌళి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలాగే మెగాస్టార్ చిరంజీవితో ప్రస్తుతం సినిమాలు చేస్తున్న మెహర్ రమేష్, మోహన్ రాజా, బాబీ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. సినిమా దర్శకుడు కొరటాల శివ, రామ్ చరణ్ తేజ, పూజ హెగ్డే రామ్, చరణ్ భార్య ఉపాసన, చిరంజీవి భార్య సురేఖ తదితరులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే ఈ సినిమాలో ముందు నుంచి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జరిగింది. కానీ వేదిక మీద గాని ఈ వేడుకను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కానీ కాజల్ అగర్వాల్ కు సంబంధించిన పేరు ఎక్కడా కనపడకపోవడం గమనార్హం. ఆ మధ్య కాజల్ అగర్వాల్ కు దర్శకుడికి మధ్య చిన్న ఇష్యూ తలెత్తిందని ఆ కారణంగానే కాజల్ అగర్వాల్ పాత్రను పూర్తిగా తొలగించారని వార్తలొచ్చాయి. తాజాగా ఆమె పేరు ఎక్కడా ప్రస్తావించకపోవడం అందుకు ఊతం ఇస్తోంది. అయితే ఈ వేడుక ప్రారంభం కావడానికి ముందు ఒక యాంకర్ మాట్లాడుతూ కాజల్ అగర్వాల్ ఈ రోజు వేడుకకు వస్తున్నారు అని చెప్పుకొచ్చింది కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. అయితే కాజల్ అగర్వాల్ పేరు ఎందుకు ప్రస్తావించలేదు? నిజంగా ఆమెను సినిమా నుంచి తప్పించారా అనే విషయాలు సినిమా విడుదలైతే గానీ చెప్పలేం.