Waltair Veerayya : అనేక అనుమానాల మధ్య వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్!
Waltair Veerayya Pre Release Event Venue Fixed:
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 8న విశాఖలో నిర్వహించేందుకు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరగబోతోంది అనే సందిగ్ధతకు తెర పడింది. నిజానికి ముందుగా ఆర్కే బీచ్‌లో ఈవెంట్ నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించినప్పటికీ పోలీసుల సూచన మేరకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ కి వేదిక మార్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 8న విశాఖ ఆర్కేబీచ్ రోడ్డులో నిర్వహించేందుకు చిత్ర బృందం అనుమతి కోరగా ఆదివారం సాయంత్రం బీచ్ రోడ్డుకు సందర్శకులు భారీగా వస్తారని.. ట్రాఫిక్, భద్రతా సమస్యలు వస్తాయని చెబుతూ నిరాకరించారు. అయితే తరువాత మళ్లీ ఆర్కే బీచ్లో నిర్వహించుకోవచ్చని చెప్పడంతో అక్కడే వేదిక నిర్మాణం మొదలు పెట్టారు. ఇక ఇప్పుడు మరోమారు అక్కడ అనుమతి లేదని చెప్పడంతో ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వాహకులు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. చిత్రబృందం విజ్ఞప్తి మేరకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలోనే ‘వాల్తేరు వీరయ్య’ ప్రీరిలీజ్ వేడుక నిర్వహించుకునేందుకు అనుమతించినట్లు విశాఖ సీపీ శ్రీకాంత్ ప్రకటించారు.చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’లో శ్రుతిహాసన్ కథానాయిక కాగా రవితేజ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.