LIVE Updates: Waltair Veerayaa Pre Release Event
Waltair Veerayaa Pre Release Function LIVE Updates
విశాఖలో సందడి వాతావరణం నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చూసేందుకు వేలాది మంది తరలివస్తున్నారు. వైజాగ్‌లో ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణం అంతా సందడిగా మారింది. అనారోగ్య కారణంగా ఈ సినిమాలో నటించిన శృతిహాసన్ ఫంక్షన్‌కు హాజరు కావడం లేదు.
వాల్తేరు వీరయ్య సినిమా ఒక మ్యూజికల్ జర్నీ అని చిరంజీవి అన్నారు. సినిమాలో అన్ని పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉందని తెలిపారు. అదే విధంగా కెమెరామేన్ ఆర్ధర్ విల్సన్ పనితీరు గురించి చిరంజీవి ప్రశంసించారు. ఈ సినిమా విజయం కోసం ఎంతో మంది నిశ్శబ్దంగా పనిచేశారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కోన వెంకట్‌తో పాటు రచయిత టీమ్ ఎంతో అద్భుతంగా డైలాగులు రాశారని చిరంజీవి గుర్తుచేశారు. ఒక కమర్షియల్ సినిమాలో ఉండాల్సినవన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చిరంజీవి తెలిపారు. ఎంతో మంది టాలెంటెడ్ నటీనటులను అద్భుతంగా నటింపచేసిన దర్శకుడు బాబీ తప్పకుండా స్టార్ డైరెక్టర్ అవుతాడని చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు.
వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ దుమ్ముదులిపేశాడని చిరంజీవి తెలిపారు. రవితేజ రాకతో సినిమా మరో లెవెల్‌కి వెళ్లిందని చిరంజీవి తెలిపారు. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమాలో నటించినందుకు రవితేజకు చిరంజీవి థ్యాంక్స్ చెప్పారు.
శృతి హాసన్ ప్రొఫెషనలిజానికి హ్యాట్స్ ఆఫ్ అని చిరంజీవి చెప్పారు. కేథరీన్ చాలా కీలకమైన పాత్రలో నటించిందని, ఆ పాత్రకు నిండుదనాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ప్రకాశ్ రాజ్, బాబీ సింహ కూడా అద్భుతంగా నటించారని తెలిపారు.
మైత్రీ మూవీస్ సంస్థపై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. రంగ స్థలం సినిమాలో నటించిన రాంచరణ్ వీళ్ల గురించి తనకెంతో గొప్పగా చెప్పాడని, వారి ప్రొడక్షన్ విలువలు ఎంతో గొప్పగా ఉంటాయని రాంచరణ్ చెప్పిన విషయాన్ని మెగాస్టార్ గుర్తుచేశారు. తాను సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తప్పకుండా మైత్రీ మూవీస్‌లో ఒక సినిమా చేయాలని రాంచరణ్ కోరాడని, ఇంత త్వరగా సినిమా చేస్తానని అనుకోలేదని తెలిపారు.
వాల్తేరు వీరయ్య ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అని చిరంజీవి అన్నారు. కథ విన్న వెంటనే ఓకే చేసిన సినిమాలు తన కెరీర్‌లో సూపర్ హిట్ అయ్యాయని చిరంజీవి గుర్తుచేశారు. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగుతుందని అన్నారు. కథ విన్న వెంటనే ఓకే చేశానని చిరంజీవి అన్నారు. ఎవరైతే కష్టపడతారో అటువంటి వారికి తాను అభిమానినని చిరంజీవి అన్నారు. అటువంటి లక్షణాలు ఉన్న బాబీకి తాను అభిమానిగా మారానని చిరంజీవి తెలిపారు.
విశాఖ పట్నానికి ఎప్పుడు వచ్చినా ఉద్వేగానికి లోనవుతానని మెగాస్టార్ అన్నారు. ఇక్కడి ప్రజలు ఎంతో శాంతి కాముకులని చిరంజీవి ప్రశంసించారు. కుళ్లు కుతుంత్రాలకు తావు ఇవ్వరని తెలిపారు. విశాఖలో ఇళ్లు కొనుక్కోవడం నా చిరకాల కోరిక అని, ఈ మధ్యే విశాఖలో ఇళ్ల స్థలం కొన్నానని... భీమిలికి వెళ్లేదారిలో ఆ స్థలం ఉందని చిరంజీవి తెలిపారు.
వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ ఖాయమని హీరో రవితేజ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హీరో రవితేజ తనకు మెగాస్టార్‌కి ఉన్న బాండింగ్ గురించి వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో షేర్ చేసుకున్నారు. వేరే వ్యక్తుల గురించి నెగిటివ్‌గా మాట్లాడడం చిరంజీవి నుంచి అస్సలు వినలేదని రవితేజ గుర్తుచేసుకున్నారు.
వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు బాబీ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చారు. చిరంజీవికి రాజకీయాలు సూట్ కావని, సినిమాల్లోనే కొనసాగాలని కోరారు. రాజకీయాలను పవన్ కళ్యాణ్ చూసుకుంటారని, మీరు సినిమాల్లో కొనసాగాలని బాబీ కోరారు. మీతో కలిసి పనిచేయడం నా అదృష్టం అని బాబీ అన్నారు.
చంద్రబోసు, రామజోగయ్య శాస్త్రి, దేవిశ్రీ ప్రసాద్‌లు ఈ సినిమాలో పాటలు రాశారని, అందరూ అద్భుతంగా పాటలు అందించారని బాబీ తెలిపారు. తమిళ నటుడు బాబీ సింహ, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తదితరులు తాను కోరగానే వెంటనే వచ్చి నటించారని బాబీ గుర్తుచేశారు.
తన సినీ కెరీర్‌లో ఎందరో స్టార్లకు హిట్ సాంగ్స్ స్కోర్ చేసే అవకాశం కలిగిందని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తెలిపాడు. గతంలో రవితేజ, చిరంజీవి సినిమాల్లో తాను చేసిన హిట్ సాంగ్స్ కు స్టేజ్‌పై డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించాడు. శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమా, ఖైదీ నెంబర్ 786 వంటి సినిమాల్లో పాటలకు డాన్స్ చేశాడు. ఈవెంట్‌లో ఉత్సాహాన్ని మరింత పెంచాడు.
Devi Sri Prasad
వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీలో అదరిపోయే స్టెప్పులతో డాన్స్ చేసిన ఊర్వశి రౌటేలా, ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మాటల ప్రవాహంతో ఆకట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు దర్శకుడు బాబీపై ప్రశంసల వర్షం కురిపించింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పనితీరుపై ప్రశంసలు కురిపించింది.
దర్శకుడు బాబీపై మైత్రీ మూవీ మేకర్స్ ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్‌తో సినిమా చేయడం తనకు ఒక డ్రీమ్ అని, బాబీ వల్లే ఆ కల నెరవేరిందని తెలిపారు. బాబీతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై కూడా ప్రశంసలు కురిపించారు. తాను రూపొందిస్తున్న సినిమాలు విడుదలకు ముందే హిట్ అవతున్నాయని, దానికి కారణం దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్కే కారణమని తెలిపారు.
దర్శకుడి బాబీ గురించి రచయిత కోన వెంకట్ కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. మెగాస్టార్‌కి ఉన్న కోట్లాది మంది అభిమానుల్లో దర్శకుడు బాబీ కూడా ఒకడని కోన వెంకట్ తెలిపారు. బాబీ తన వద్ద చాలా సినిమాకు అసిస్టెంట్‌గా పనిచేశాడని గుర్తుచేశారు. బాబీ ఎంతో పట్టుదల గల మనిషని కోన వెంకట్ గుర్తుచేసుకున్నారు.
మెగాస్టార్ గత సినిమాల్లో హిట్ సాంగ్స్ కు పలువురు డాన్సర్లు అదరగొట్టే డాన్సులు చేశారు. సత్య మాస్టర్ గ్రూప్ చేసిన ఓ డాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా పక్కపక్కనే కూర్చుని డాన్సర్ల షోలను ఎంజాయ్ చేశారు.
వాల్తేరు వీరయ్య సినిమా హీరోలు చిరంజీవి, రవితేజ స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో అభిమానుల్లో కోలాహలం మొదలయింది. కేరింతలతో అభిమానులతో మెగాస్టార్‌కి స్వాగతం పలికారు. ఈవెంట్‌ను చూసేందుకు చిరంజీవి ఇద్దరు కుమార్తెలు కూడా వచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీట్లలో కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు.
Mega Star And Ravi Teja
నటి అషురెడ్డి అదిరిపోయే డాన్స్ తో అదరగొట్టింది. డాన్సర్ల గ్రూప్‌తో వచ్చిన అషురెడ్డి వాల్తేరు వీరయ్యలో ఓ పాటకు చలాకీగా డాన్స్ చేసింది. అభిమానులను అలరించింది.
Dancers
కామెడీ నటులు శ్రీనివాస రెడ్డి, శకలక శంకర్, సప్తగిరి స్టేజ్‌పై చేరి సుమతో కలిసి సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి గత సినిమాల్లోని క్లిప్పింగులు చూస్తూ డైలాగులు చెబుతూ డైలాగులతో అలరించారు.
ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌లో జరుగుతున్న వాల్తేరు వీరయ్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు అభిమానులు పోటెత్తారు. మెగా అభిమానులు భారీగా తరలిరావడంతో గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. ఆదివారం కావడంతో అనుకున్నదాని కంటే ఎక్కువగా ఫ్యాన్స్ తరలివచ్చారు. విశాఖ నుండే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుండి కూడా అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎక్కడ చూసినా చిరంజీవి కటౌట్లతో అభిమానులు సందడి చేస్తున్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక వద్దకు మెగా టీమ్ ఇంకా చేరుకోలేదు. దీంతో వివిధ కార్యక్రమాలతో అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. సత్య మాస్టర్ టీమ్ డాన్స్ షో తో అలరించింది.
విశాఖలో ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అసలు సందడి మొదలయింది. యాంకర్ సుమ వచ్చే రాగానే అభిమానులు కేరింతలతో స్వాగతం పలికారు. వాల్తేరు వీరయ్య టీజర్‌ను ప్రదర్శించారు. ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఒక్కక్కరూ వేదిక వద్దకు చేరుకుంటున్నారు.
నోవాటెల్ హోటల్ నుంచి మరికాసేపట్లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుక జరుగుతున్న ఏయూ గ్రౌండ్‌కి మెగాస్టార్ చేరుకోనున్నారు. మెగాస్టార్‌తో పాటు రవితేజ, డైరెక్టర్ బాబీ తదితరులు కూడా కాసేపట్లో ఏయూ గ్రౌండ్‌కి చేరుకోనున్నారు.
Mega Poster
వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరోయిన్ శృతిహాసన్ హాజరు కావడం లేదు. అనారోగ్య కారణంగా హాజరు కావడం లేదని ఇన్‌స్టా గ్రామ్ ద్వారా వెల్లడించింది. కోవిడ్ కాకూడదని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు శృతిహాసన్ ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఈవెంట్‌కు హాజరు కాలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేసింది. ఇటీవల ఒంగోలులో జరిగిన వీర సింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్‌కు శృతి హాజరయింది.
వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సింగర్ సింహ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలివనున్నారు. మొత్తంగా 40 నిమిషాల పాటు తన పాటలతో అభిమానులను అలరించనున్నారు. మొత్తం నలుగురు సింగర్స్ తో కూడిన టీమ్ చిరంజీవి సినిమాల్లోని పాటలు పాడనున్నారు. అభిమానుల్లో మరింత జోష్ నింపనున్నారు.
ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు 30 వేల మంది పాస్‌లను జారీ చేశారు. పోలీసులు కట్టుదిట్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఫంక్షన్ జరిగే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులు నిఘా నేత్రంలో వ్యవహరిస్తున్నారు.
ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ మెగా అభిమానులతో నిండిపోయింది. మెగాస్టార్ వీరాభిమానులు కొందరు వాల్తేరు వీరయ్య గెటప్ వేసుకుని సందడి చేస్తున్నారు. డాన్సులు వేస్తూ హల్‌చల్ చేస్తున్నారు. కేరింతలతో హంగామా సృష్టిస్తున్నారు. పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారు.
మెగాస్టార్ తాజా సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పెట్టడానికి గల కారణాన్ని దర్శకుడు బాబీ కొన్ని గంటల క్రితం వెల్లడించారు. చిరంజీవికి తొలి ఫోటో షూట్ చేసిన వ్యక్తి పేరే వీరయ్య అని బాబీ తెలిపారు. వీరయ్య తీసిన ఫోటోలను తీసుకుని చిరంజీవి మద్రాసు వచ్చారని, అందువల్లే తన సినిమాకు వీరయ్య అనే టైటిల్ ఉండాలని భావించానని బాబీ తెలిపారు.