Varasudu Movie Review : ‘వారసుడు’గా విజయ్ మెప్పించాడా ?
Varasudu Movie Review: దిల్ రాజు బ్యానర్ నుండి ఒక సినిమా వస్తుందంటే ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటాయి. వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజ్ బ్యానర్లో విజయ్,రష్మిక జంటగా తెరకెక్కిన చిత్రం వారసుడు. ఈ చిత్రం తెలుగు,తమిళ్ లో ఒకే సమయంలో నిర్మించారు. తమిళ్ లో 12 వ తేదీ విడుదల కాగా తెలుగులో సంక్రాంతి కానుకగా ఈరోజు విడుదలైంది. తమిళ్ తో పాటు విజయ్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. మరి వారసుడిగా విజయ్ మెప్పించాడు లేదా చూద్దాం.
రాజేంద్రన్ (శరత్ కుమార్) ఓ పెద్ద బిజినెస్ మాన్. తన వ్యాపార సామ్రాజ్యాన్ని తన ముగ్గురు కొడుకులు జై (శ్రీకాంత్), అజయ్ (శ్యామ్), విజయ్ (విజయ్) వీళ్ళలో ఎవరికి అప్ప చెప్పాలనే ఆలోచనలో ఉంటాడు. విజయ్ తన తండ్రి విధానాలు నచ్చక అభిప్రాయ భేదాలు వచ్చి విబేధించి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. జై, అజయ్ ల కన్ను మాత్రం ఈ చైర్మన్ కుర్చీ పైనే ఉంటుంది. ఏడు సంవత్సరాల తర్వాత రాజేంద్రకు అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ అని తెలుస్తుంది. దీంతో భార్య సుధ (జయసుధ) కోరిక మేరకు షష్టిపూర్తి వేడుకలకు ఒప్పుకుంటాడు. ఆ వేడుకలకు విజయ్ కూడా వస్తాడు. అనుకోని కారణాలతో కార్యక్రమం ఆగిపోతుంది. మళ్లీ ఇంట్లో నుంచి బయటపడాలనుకుంటాడు విజయ్. కానీ అప్పుడే కొన్ని నిజాలు తెలుస్తాయి. రాజేంద్రన్ సామ్రాజ్యాన్ని జయ ప్రకాశ్(ప్రకాశ్ రాజ్) కూల్చేయాలనుకుంటాడు. జయ ప్రకాశ్ చేస్తున్న కుట్రలకు విజయ్ ఎలా స్పందించాడు? తన అన్నలలో ఎలాంటి మార్పు తెచ్చాడు? రష్మికతో ప్రేమ ఎలా మొదలవుతుంది? అనే విషయాలు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
విజయ్ ఓ ఫ్యామిలీ స్టోరీ చేసి చాలా కాలమే అయింది. ఫ్యామిలీ ఎమోషన్స్, కంటతడి పెట్టించే సీన్స్‌లో విజయ్ మెప్పిస్తాడు. విజయ్‌లోని మాస్ ఇమేజ్‌ను బాగానే వాడుకున్నారు. యాక్షన్, కామెడీ ఇలా అన్ని యాంగిల్స్‌లో అదరగొట్టేశాడు. రష్మిక పాత్రకు అంతపెద్ద స్కోప్ లేదు ఎదో పాటలకు మాత్రమే అన్నట్టుగా ఉంది. ‘వారసుడు’ కొత్త కథేమీ కాదు. మనం ఇప్పటికే చాలా సార్లు చూసిన కథ. కానీ దీన్ని ఆకట్టుకునేలా స్క్రీన్ ప్లే లో దర్శకుడు వంశీ పైడిపల్లి కొత్తదనం చూపించాడు. ఇది విజయ్ ఫ్యాన్స్ కు మాత్రం నచ్చుతుంది. పాత కమర్షియల్ ఫార్మాట్ లోనే కథ వెళ్తుంది. కొత్తదనం ఉన్నట్టుగా అనిపించదు.
నటీనటుల విషయానికొస్తే శరత్ కుమార్, జయసుధ జంటగా చక్కగా సరిపోయారు.. ఎవరి పాత్రలో వారు చక్కగా నటించారు. శ్రీకాంత్, సంగీత, కిక్ శ్యామ్, ఇలా అందరూ మెప్పించారు. ప్రకాష్ రాజ్‌ను ఇలాంటి పాత్రల్లోచూడడం కొత్తేమికాదు. మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు. ఫస్టాఫ్ లో ఒక్క యాక్షన్ సీన్ కూడా ఉండదు. విజయ్ సినిమా అంటేనే సగటు ప్రేక్షకుడు ముందుగా యాక్షన్ సీన్స్ కోరుకుంటాడు. కానీ ఇందులో విజయ్‌తో ఎక్కువగా ఫన్ క్రియేట్ చేసాడు దర్శకుడు. ఎప్పుడైతే విజయ్ ను సీఈవోగా ప్రకటించి కుటుంబం విడిపోతుందో అప్పటి నుంచి యాక్షన్ సన్నివేశాలు ప్రారంభం అవుతాయి. స్క్రీన్ మీద నడుస్తున్న సన్నివేశాలు ఇంతకుముందే చూశామనిపించిన బోర్ మాత్రం కొట్టదు. సినిమా అంతా అలాగే సాగిపోతుంది.
ఎస్.ఎస్.థమన్ సంగీతం రీ-రికార్డింగ్ ఆకట్టుకుంటాయి. పాటల్లో రంజితమే,మదర్ సాంగ్ ఆకట్టుకుంటాయి. కమర్షియల్ సినిమాలకు రీ-రికార్డింగ్ చాలా ముఖ్యం. ఆ విషయంలో కూడా థమన్ సక్సెస్ అయ్యాడు. కార్తీక్ పళణి సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సినిమాలో ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది. విజువల్స్ పరంగా సినిమాను ఎంతో రిచ్‌గా తీశారు. దిల్ రాజు నిర్మాణ విలువలు బాగున్నాయి. విజయ్ సినిమాలు ఫాలో కాని వారు మాత్రం ఆ స్థాయిలో ఎంజాయ్ చేయలేరు. అయితే అది అంత ఫోర్స్ గా అనిపించవు. కథలో భాగంగా వచ్చేస్తాయి. మధ్య మధ్యలో సెంటిమెంట్ సీన్స్ నీ అతికిచ్చినట్లనిపిస్తుంది. చివరాగా చెప్పాలంటే ఫాన్స్ కు మాత్రమే వారసుడు.