Tammareddy Bharadwaj: నాగబాబుపై తమ్మారెడ్డి ఘాటు కామెంట్లు!
Tammareddy Bharadwaj: ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ రూ.80 కోట్లు ఖర్చు చేసిందని, ఆ డబ్బు తనకిస్తే 8 సినిమాలు తీసి ముఖాన కొడతామని తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్లు చేయగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నాగబాబు తీవ్రంగా ఖండించిన అంశం చర్చనీయాంశం అయింది. ఆర్ఆర్ఆర్ టీమ్ వాళ్లు ఎంత ఖర్చు పెట్టారో తమ్మారెడ్డి వద్ద అకౌంట్స్ ఉన్నాయా? అంటూ రాఘవేంద్రరావు ప్రశ్నించగా, వైసీపీ వాళ్లకు వారి భాషలోనే సమాధానం చెప్పాలని నాగబాబు పొలిటికల్ టచ్ ఇస్తూ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో, రాఘవేంద్రరావు, నాగబాబు వ్యాఖ్యలకు తమ్మారెడ్డి భరద్వాజ ఘాటు కౌంటర్ ఇచ్చారు. తాను నోరు విప్పితే అందరి అకౌంట్స్ బయటపడతాయి అని హెచ్చరించిన ఆయన నేను మాట్లాడటం మొదలు పెడితే ఒక్కొక్కడి అకౌంట్ ఏంటో తెలుస్తుంది విని తట్టుకోగలరా? అని సవాల్ విసిరారు.
“ఇండస్ట్రీలో ఉన్న చాలామంది అకౌంట్లు నాకు తెలుసన్న తమ్మారెడ్డి అవార్డుల కోసం ఎవరి కాలు ఎవడు పట్టుకున్నాడో తెలుసని అన్నారు. ల్యాండ్ కోసం ప్రభుత్వాలకు లేఖలు రాసి ల్యాండ్స్ తీసుకున్న విషయం తెలుసు, ల్యాండ్స్ ఇవ్వకపోతే విమర్శించింది తెలుసని అన్నారు. సాధారణంగా తాను ఏదైనా వ్యాఖ్యలు చేసినప్పుడు బయటి వాళ్లు స్పందిస్తుంటారని, ఈసారి చిత్ర పరిశ్రమకు చెందిన వాళ్లే మాట్లాడుతుండటంతో తాను గట్టిగా సమాధానం చెప్పాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ ఎంతో గొప్ప చిత్రం అని చెప్పా, అప్పుడెవడూ పట్టించుకోలేదు కానీ ఓ చిన్న క్లిప్పింగ్ పై మాత్రం రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. నీకు అకౌంట్స్ తెలుసా అని ఒకడు, నీ అమ్మ మొగుడు అంటాడు ఇంకొకడు అంటూ తమ్మారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.