Singer Mangli: మంగ్లీ కారుపై రాళ్ల దాడి.. అసలేం జరిగిందంటే?
Singer Mangli Clarity: టాలీవుడ్ సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోని బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో జరిగిన బళ్లారి ఫెస్టివ్ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు ఆ వార్తల సారాంశం. ఈ వేడుకకు సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని ముఖ్య అతిథులుగా హాజరవగా తన ప్రదర్సన ఇచ్చి వెనుతిరిగిన తరువాత మంగ్లీ కారు మీద దాడి జరిగినట్టు వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం చిక్కబళ్లాపూర్ లో ఒక ఈవెంట్లో మంగ్లీ పాల్గొనగా అప్పుడు కన్నడలో మాట్లాడమని అడిగినా మాట్లాడకుండా తెలుగులోనే మాట్లాడింది. ఈ క్రమంలూ కర్ణాటక వచ్చి కన్నడలో మాట్లాడకుండా ఆగ్రహాన్ని వ్యక్తం చేసి, దాడి చేసినట్టు వార్తలు వచ్చాయి.
అయితే ఈ విషయం మీద మంగ్లీ క్లారిటీ ఇచ్చింది. నిన్న బళ్లారిలో జరిగిన ఓ కార్యక్రమంలో నాపై దాడి జరిగిందని కొన్ని సోషల్ మీడియా గ్రూపులు ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలను నేను పూర్తిగా ఖండిస్తున్నానని ఆమె పేర్కొంది. ఫోటోలు, వీడియోల నుండి మీరందరూ చూడగలిగే విధంగా, ఈవెంట్ భారీ విజయాన్ని సాధించిందని, తన బెస్ట్ ఈవెంట్‌లలో ఒకటని ఆమె పేర్కొంది. కన్నడ ప్రజలు నాపై కురిపించిన ప్రేమ, మద్దతు అపారమైనదని ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఆ ఈవెంట్లో నన్ను చాలా బాగా చూసుకున్నారు, ఇది మాటలలో వర్ణించలేనిదని అన్నారు. ఇదంతా నా ప్రతిష్టను కించపరచడానికి చేస్తున్నారని, ఈ విధమైన తప్పుడు ప్రచారాన్ని నేను ఖండిస్తున్నానని, మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అంటూ ఆమె పేర్కొంది.