Samantha Sizzling Song: మరోసారి వెండితెరను షేక్ చేయనున్న సమంత, యశోద సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్
పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ సమంత పాపులారిటీని మరింత పెంచింది. సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ ఊ అంటావా పాట మార్మోగిపోయింది. సమంత స్టెప్పులకు కోట్లాది మంది పులకించిపోయారు. యూ ట్యూబ్‌లో ఆ సాంగ్‌ను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఇప్పటికీ ఆ పాట క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఇదిలా ఉంటే సమంత మరో వేడి పుట్టించే సాంగ్‌తో త్వరలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమౌతోంది. సమంత నటిస్తున్న యశోద సినిమాలో కూడా ఓ మాంచి ఐటెం సాంగ్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సిజ్లింగ్ సాంగ్ కోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను వేసి షూటింగ్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. పుష్ఫలోని ఐటెం సాంగ్‌ను మించిపోయేలా ఈ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై శివలెంక క్రిష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. గతంలో ఆదిత్య 369, సమ్మోహనం వంటి సినిమాలను ప్రేక్షకులకు అందించిన క్రిష్ణ ప్రసాద్ కొంత కాలం గ్యాప్ తర్వాత యశోద సినిమా తీస్తున్నారు. సమంతకు పెరిగిన పాన్ ఇండియా అభిమానులను దృష్టిలో పెట్టుకుని సినిమా కథను సిద్ధం చేసినట్లు నిర్మాత గతంలో వెల్లడించారు. అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల, అన్ని వయస్సుల ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు.
మలయాళ యువ కెరటం ఉన్ని ముకుందన్ యశోద సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రావ్ రమేశ్, మురళీ శర్మ, వరలక్ష్మీ శరత్‌కుమార్, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేశ్, దివ్యా శ్రీపాద, ప్రియాంక శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
రోజు రోజుకు పెరుగుతున్న ఫ్యాన్ బేస్
సమంత అభిమానుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఆమెకు ఫ్యాన్స్ పెరుగుతున్నారు. హిందీ వెబ్‌సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ ద్వారా హిందీ ప్రాంతాల్లో సమంత పాపులారిటీ పెరిగింది. పుష్ప తర్వాత ఆ పాపులారిటీ మరింత పెరిగింది. త్వరలో విడుదల కానున్న యశోద సినిమాతో ఆమె క్రేజ్ మరింత పెరగనుంది.
ఆగస్టు 12న విడుదల
హరి శంకర్ దర్శకత్వం వహించిన యశోద సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో యశోద సినిమాను విడుదల చేయనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు మార్గాండ్ కే వెంకటేశ్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.