Sai Pallavi : ‘ది కాశ్మీర్ ఫైల్స్’ వివాదం మంచి గుణపాఠం
Sai Pallavi says The Kashmir Files controversy was a learning experience : సౌత్ బ్యూటీ సాయి పల్లవి కొన్ని రోజుల క్రితం “ది కాశ్మీర్ ఫైల్స్” సినిమా విషయంలో చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆమె కామెంట్స్ ను వ్యతిరేకిస్తూ చాలామంది దారుణంగా ట్రోల్ చేశారు. నిజానికి సాయి పల్లవి “ది కాశ్మీర్ ఫైల్స్” సినిమా గురించి మాట్లాడుతూ మతం పేరుతో జరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేసింది. కానీ అనుకోకుండా వివాదంలో చిక్కుకుంది. అయితే తన వ్యాఖ్యలపై సాయి పల్లవి వివరణ ఇచ్చుకోక తప్పలేదు. ఎటువంటి విషాదాన్ని తక్కువ చేయడానికి ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, ఎవరినీ బాధ పెట్టడానికి తాను అలా చేయలేదని చెప్పుకొచ్చింది. తన అభిప్రాయాన్ని వక్రీకరించారని స్పష్టం చేసింది. తాజాగా ఆ వివాదంపై స్పందించిన సాయి పల్లవి ఆ ఘటన తనకు మంచి పాఠాన్ని నేర్పిందని చెప్పుకొచ్చింది.
సాయి పల్లవి మాట్లాడుతూ ‘ఆ రోజు నేను ఎలాంటి రాజకీయ అంశంపై మాట్లాడకపోయినా వివాదాస్పదం అవ్వడం ఆశ్చర్యంగా అన్పిస్తుంది. ‘దయచేసి మతం పేరుతో ఒకరినొకరు చంపుకోకండి’ అని మాత్రమే చెప్పానని, కొందరు తన అభిప్రాయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, తన వ్యాఖ్యలను ఇలా అపార్థం చేసుకుంటారని ఎప్పుడూ అనుకోలేదని, మనం మతం విషయంలో గొడవ పడకూడదని మాత్రమే తాను చెప్పదలుచుకున్నాను అని సాయి పల్లవి స్పష్టం చేసింది. అయితే ఆ వివాదం తర్వాత ఇప్పుడు ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తానని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.