Hero Tarun:బాల నటుడిగా `మనసు మమత`(Manasu Mamatha) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన యువ నటుడు తరుణ్.
Hero Tarun:బాల నటుడిగా `మనసు మమత`(Manasu Mamatha) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన యువ నటుడు తరుణ్. తొలి చిత్రంతో నంది పురస్కారాన్ని సొంతం చేసుకుని ఔరా అనిపించిన తరుణ్ ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam) తెరకెక్కించిన `అంజలి` మూవీతో ఉత్తర బాలనటుడిగా జాతీయ అవార్డుని దక్కించుకుని ఆశ్చర్యపరిచారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే స్టార్‌గా ఎదిగి లవర్ బాయ్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. వరుసగా ప్రేమకథా చిత్రాలతో యూత్‌లో మంచి పాపులారిటీని దక్కించుకున్నారు.
అయితే హీరోగా భారీ క్రేజ్‌ని ఏర్పరచుకున్న తరుణ్ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సినిమా ఈవెంట్లలోనూ తరుణ్ కనిపించడం లేదు. ఇటీవల `నువ్వే నువ్వే` 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరువాత మరో సినిమా అంగీకరించిలేదు. మరో ఈవెంట్లో కనిపించలేదు. ఇదిలా ఉంటే తరుణ్ తల్లి, అలనాటి హీరోయిన్ రోజా రమణి తాజాగా ఓ యూట్యూబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తరుణ్ గురించి భావోద్వేగానికి లోనయ్యారు.
తరుణ్ కెరీర్, అతనిపై వస్తున్న రూమర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `తరుణ్‌కు చిన్నతనం నుంచి భక్తి ఎక్కువ. గంటన్నర సేపు పూజ చేసుకోకుండా తరుణ్ బయటికి వెళ్లడు. అంతే కాకుండా సాయం చేయడంలోనూ తరుణ్ ఎప్పుడూ ముందే ఉంటాడు. నేను నటించిన తొలి సినిమాతో నాకు నేషనల్ అవార్డ్ వచ్చింది. నాలాగే తరుణ్ నటించిన తొలి సినిమాకు జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. తరుణ్ అవార్డు అంఉకుంటున్న సమయంలో నాకు, మావారికి కన్నీళ్లు ఆగలేదు. ఇద్దరం ఆ క్షణాలని ఎంతో ఆస్వాదించాం` అన్నారు.
తరుణ్‌పై వస్తున్న రూమర్లపై స్పందించారు. `ఎలాంటి ఆధారాలు లేకుండానే రూమర్స్ రాస్తారు. అవి చూసినప్పుడు బాధగా అనిపిస్తుంది. ఎందుకిలా రాస్తున్నారనిపిస్తుంది. అయితే అలాంటి అసత్య ప్రచారాల గురించి బాధపడటం ఎందుకని వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం అభిమానుల ఆశీర్వాదాల వల్ల మేమంతా బాగున్నాం. తరుణ్ పెళ్లైతే చాలు. అంతకు మించి ఏ కోరికలు లేవు. తరుణ్ పెళ్లి సమయం వచ్చినప్పుడు అవుతుంది` అన్నారు.
ఇక తరుణ్ సినిమాల్లో రీఎంట్రీ గురించి కూడా ఆసక్తికర వివరాలు తెలియజేశారు. త్వరలోనే తరుణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలిపారు. తరుణ్ ఓ వెబ్ సిరీస్‌తో పాటు ఓ సినిమాని ఓకే చేశారట. ఈ రెండింటిలో ఏది ముందు విడుదలవుతుందన్నది చూడాలన్నారు. తరుణ్ ప్రేక్షకుల ఆశీర్వాదంతో మళ్లీ సినిమాల్లో రాణిస్తాడని రోజా రమణి ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. మరి తరుణ్ సినిమాతో ప్రేక్షకులని అలరిస్తారా? లేక సిరీస్‌తో రీ ఎంట్రీ ఇస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.