‘పిశాచి 2’ టీజర్ విడుదల
కోలీవుడ్ డైరెక్టర్ మిస్కిన్ సినిమాలు అంటే అరచేతిలో గుండెలను పట్టుకొని చూడాలి అనే పేరు ఉంది. హర్రర్ అయినా, థ్రిల్లర్ సినిమాలు అయినా ఆయనకు కొట్టిన పిండి. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘పిశాచి 2’. 2014లో విడుదలైన `పిశాచి` చిత్రానికిది సీక్వెల్.. ఇక ఈ చిత్రంలో ఆండ్రియా ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. పూర్ణ, విజయ్ సేతుపతి, ప్రతాప్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ తోనే భయపెట్టిన మిస్కిన్ టీజర్ తో మరింత భయపెట్టే ప్రయత్నం చేశాడు.
టీజర్ విషయానికొస్తే.. రెడ్ కలర్ థీమ్ తో అంతా చీకట్లోనే రూపొందించిన ఈ మూవీలోని సన్నివేశాలు ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టించేలా వున్నాయి. పెద్దవాళ్లకైనా వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలు.. అందుకు తగ్గట్టు కార్తీక్ రాజా అందించిన నేపథ్య సంగీతం వింటే హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లకు గుండెపోటు రావడం ఖాయం. మాటలు లేని ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేయడానికి ముందుకు రావడంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో మిస్కిన్ ప్రేక్షకులను ఎలా భయపెడతాడో చూడాలి.