Oscars 2023: మొదలైన ఆస్కార్ సంబరం.. నాటు నాటు పై సర్వత్రా ఉత్కంఠ
Oscars 2023: ప్రపంచ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆస్కార్స్ 2023 లేదా 95వ అకాడమీ అవార్డుల సంబరం రానేవచ్చింది. అవార్డుల ప్రదానోత్సవానికి అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో ఉన్న డాల్బీ థియేటర్ సర్వాంగ సుందరంగా ముస్తాబు అయ్యింది. భారత కాలమాన ప్రకారం నేడు ఉదయం 5.30 నుంచి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈసారి నామినేషన్లలో రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం నుంచి నాటునాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ ఆస్కార్ వేదికపై ఎన్టీఆర్ బ్లాక్ పాంథర్ సూట్‌లో సందడి చేశాడు. సూట్‌పై గర్జించే పులి బొమ్మ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అందరు ఆ సూట్ పైనే ఓ లుక్కేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ సతీసమేతంగా ఆస్కార్ వేదిక దగ్గరకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా కలర్ ఫుల్ దుస్తుల్లో కనువిందు చేశారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలిచిన నేపథ్యంలో ఈ దఫా వేడుకలు భారత చలనచిత్ర రంగానికి విశేషమైనవి. గోల్డెన్ గ్లోబ్, హాలివుడ్ సినీ క్రిటిక్స్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను కైవసం చేసుకొని ఇప్పటికే విశ్వవ్యాప్తంగా విశేష క్రేజ్ సంపాదించుకున్న ‘నాటునాటు’ పాట ఆస్కార్‌ను కైవసం చేసుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆరంభమైన ఈ ఆస్కార్ పండగలో వేదికపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ నాటు నాటు సాంగ్ లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అలాగే బ్లాక్ ట్రెడిషనల్ వేర్లో.. లాల్చీ, పంచకట్టులో కనిపించి అందరిని తమ పాటతో ఒక ఊపుఊపేసారు. ఈ పాటకు వేడుకలో ఉన్నవారందరూ కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేసారు.
ఇప్పటికే అన్ని అవార్డులను షార్ట్ లిస్ట్ చేసి ది బెస్ట్ క్యాటగిరీలోకి తీసుకున్నారు. మరి బెస్ట్ ఒరిజినల్ పాటలో నిలిచిన నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావాలని ప్రతి తెలుగోడు ఉత్కంతంగా ఎదురుచూస్తున్నారు. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌గా అవార్డు దక్కించుకున్న పినాకియో. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఆస్కార్ అందుకున్న కీ హుయ్ క్వాన్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ కి జామీ లీ కర్టిస్ గెలుచుకుంది. వేదికపై అవార్డ్ అందుకున్న జామీ లీ.. చిత్రయూనిట్ తోపాటు తనకు సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో బ్లాక్ పాంథర్, వకాండ ఫరెవర్ చిత్రం ఆస్కార్ దక్కించుకుంది. మేకప్ అండ్ హెయిర్‌స్టైల్ విభాగంలో ది వేల్ చిత్రం ఆస్కార్ అందుకుంది.