ANR Memories: తెలుగు సినీ జగత్తు రెండో కన్ను.. అక్కినేని
Telugu Cine Legendery ANR Death Anniversary: ఆయన చదువుకోలేదు.. కానీ, జీవిత ప్రయాణంలో ఓ డాక్టర్. ఆయన నాటక రంగంలో స్త్రీ పాత్రధారి.. వెండితెరపై మాత్రం విషాదాంత ప్రేమ కథల రారాజు. ఆయన నాస్తికత్వాన్ని నమ్మారు.. సినీ జీవితంలో మాత్రం అపర భక్తుడిగా ప్రేక్షకులను ఓలలాడించారు. రైల్వే స్టేషన్ లో ఓ నిర్మాత కంటపడి.. సినీ అరంగేట్రం చేసి.. 75 ఏళ్ల పాటు తెలుగు తెరను పరిపుష్టం చేశారు. చివరి శ్వాస వరకు సినిమానే లోకంగా జీవించారు. కుమారుడు, మనవళ్లతో ఆఖరిసారిగా ‘‘మనం’’దరికీ కనిపించి మరలిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఉపోద్ఘాతంతోనే తెలిసిపోయి ఉంటుంది ఆయన ఎవరని..?
తెలుగు సినీ తల్లికి ఒక కన్ను నందమూరి తారక రామారావు అయితే, మరో కన్ను అక్కినేని నాగేశ్వరరావు. ఎన్టీఆర్ కంటే ముందే తెరంగేట్రం చేసి.. ఆయనతో పోటీ పడి.. చివరకు తన ప్రత్యేకత ఏమిటో గుర్తించి.. ఎన్టీఆర్ కు దీటుగా నిలిచారు అక్కినేని. ఇదేమీ సామాన్యమైన విషయం కాదు. ఎంతో చాకచక్యం ఉంటేగాని సాధ్యమయ్యేదీ కాదు. ‘‘ట్రాజెడీ కింగ్’’.. బాలీవుడ్ లో దిలీప్ కుమార్ కు ఉన్న బిరుదు. దక్షిణాదిన ఆ ఖ్యాతి మరెవరికైనా దక్కిందంటే అది ఏఎన్నారే. అక్కినేని నాగేశ్వరరావు 1924 సెప్టెంబరు 20న గుడివాడ దగ్గర్లోని రామాపురంలో జన్మించారు. 2014 జనవరి 22న మరణించారు. నేడు ఆయన 9వ వర్థంతి. ఒక్క మాటలో చెప్పాలంటే వరి చేల నుంచి.. నాటక రంగం ద్వారా కళారంగం లోకి వచ్చిన వ్యక్తి. అక్కినేనిని విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రముఖ నిర్మాత ఘంటసాల బలరామయ్య చూడడం.. సినిమాలకు పరిచయం చేయడం.. ధర్మపత్ని సినిమాతో ప్రారంభించి 75 సంవత్సరాల పైగా కాలం తెలుగు, తమిళ సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ తో తెలుగు సినిమా మూల స్తంభంగా నిలిచారు.
తెలుగు సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలిగిన ఎన్టీఆర్ కు సరిజోడు ఎవరంటే ఠక్కున చెప్పే పదం ఏఎన్నార్. మూడు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు ఏఎన్నార్ ను వరించి వచ్చాయి. ఎన్టీఆర్ తో పోటాపోటీగా నటిస్తూనే.. కలిసి 14 సినిమాల్లో నటించారు. ‘‘గుండమ్మ కథ’’; ‘‘మాయాబజార్’’, ‘‘మిస్సమ్మ’’, ‘‘తెనాలి రామకృష్ణ’’ తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యాల్లాంటి ఈ సినిమాల్లో వీరిద్దరూ కీలక పాత్రధారులు కావడం విశేషం. మద్రాస్ లో ఉంటూ అక్కడే ఉండిపోయేలా కనిపించిన తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్ కు తీసుకొచ్చిన ఘనత ఏఎన్నార్ దే. ఓ మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ మాటే చెల్లుబాటు అవుతున్న కాలంలో.. తన నిర్మాతలతో కలిసి హైదరాబాద్ వచ్చేసి సంచలనం రేపారు ఏఎన్నార్. అలా.. తర్వాత ఒక్కొక్కరూ వచ్చేయక తప్పలేదు. ఈ రోజు తెలుగు సినీ కేంద్రంగా హైదరాబాద్ విరాజిల్లుతున్నదంటే దానికి కారణం ఏఎన్నారే అనడంలో సందేహం లేదు.
ఏఎన్నార్ చదువుకోలేదు. కానీ, జీవితం అంటే ఏమిటో బాగా తెలిసినవారు. ఏదైనా మొహమాటం లేకుండా చెప్పేసేవారు. ఎవరైనా తనను పొగుడుతుంటే వెంటనే అడ్డుకట్ట వేసేవారు. పొగడ్త అంటే అందులోనూ సినీ రంగంలో పొగిడేవారంటే ఆయనకు సరైన అభిప్రాయం ఉండేది కాదు. నాస్తికుడైన అక్కినేని.. కబీర్ దాస్, వాల్మీకి, మహా కవి కాళిదాసు, భక్త జయదేవ, అమరశిల్పి జక్కన, విప్రనారాయణ, భక్త తుకారాం తదితర ఆధ్యాత్మిక, భక్తి ప్రాధాన్య పాత్రలను నిరుపమాన రీతిలో పోషించారు. తెలుగు చిత్రసీమలో ‘ట్రాజెడీ కింగ్’ మాటకు ప్రాణం పోశారు అక్కినేని నాగేశ్వరరావు. భగ్నప్రేమికుడిగా ఆయన నటన శిఖర సమానం. ‘రోమియో-జూలియట్’, ‘లైలా-మజ్ను’, ‘సలీమ్- అనార్కలి’, ‘దేవదాసు’ ఇలా ఎన్నో పాత్రలను అక్కినేని తప్ప మరెవరూ చేయలేరు అనేంతగా కీర్తి సంపాదించారు. ప్రేమ విఫలమై తాగుబోతుగా మారితే వారిని ‘దేవదాసు’ అయ్యాడని అంటాం. కాగా, ప్రఖ్యాతి గాంచిన ప్రేమకథల్లో మూడింట్లోనూ ఏయన్నార్ నటించడం దేవదాసుతో వచ్చిన కీర్తితోనే అక్కినేని అందరికీ చేరువయ్యారు. అమర ప్రేమికుడిగా గుండెల్లో నిలిచిపోయారు. కానీ, ‘దేవదాసు’ కంటే నాలుగేళ్ళ ముందుగానే 1949లో ‘లైలా-మజ్ను’లో భగ్నప్రేమికుడిగా అక్కినేని అలరించారు. ఇక అదే సమయంలో ఆయన జానపద చిత్రాలతోనూ మెప్పించారు. అయితే, ఎన్టీఆర్ ఆగమనంతో ఏయన్నార్ పంథా మార్చారు. ఎన్టీఆర్ తో కలిసి నటించిన ‘పల్లెటూరి పిల్ల’ జానపద చిత్రంలో త్యాగం మూర్తీభవించే పాత్రలో నటించారు.
‘ప్రేమనగర్’లో చివరకు కథ సుఖాంతమవుతుంది. కానీ, ప్రియురాలు దూరం కావడంతో విషం తాగి చనిపోవాలనే పాత్రలో ఏఎన్నార్ తనదైన శైలిలో నటించి ఆకట్టుకున్నారు. అంతకుముందు ట్రాజెడీ రోల్స్ లో ఏయన్నార్ నటించడం ఒక ఎత్తు, ఆయనతో దాసరి నారాయణరావు రూపొందించిన ‘ప్రేమాభిషేకం’లో అభినయించడం మరో ఎత్తు. ఏయన్నార్ పెళ్లి రోజయిన 1981 ఫిబ్రవరి 18న ఈ సినిమా విడుదలైంది. ప్రేయసి కోసం పాట్లు పడి, చివరకు ఆమె ప్రేమను దక్కించుకున్న హీరో తనకు కేన్సర్ వ్యాధి ఉందని తెలుసుకుంటాడు. దాంతో ఆమె మనసు మారేలా చేసి, ఆమెను ఎంతగానో ప్రేమించే వ్యక్తితో పెళ్ళి జరిగేలా చేస్తాడు హీరో. చివరకు అతని మంచి తనం తెలిసిన హీరోయిన్, క్షమించమని వేడుకొనేందుకు వచ్చే సరికే హీరో అంతిమగడియల్లో చివరి చూపు చూసి కన్నుమూస్తాడు. నిజం చెప్పాలంటే అంతకు ముందు ఏయన్నార్ పోషించిన విషాదాంత ప్రేమకథలకంటే భిన్నంగా ‘ప్రేమాభిషేకం’ రూపొందింది.
తొలుత 30 కేంద్రాలలో శతదినోత్సవం చూసి, ఆ తరువాత మరో 13 కేంద్రాలలోనూ వందరోజులు నడిచిందీ చిత్రం. అప్పట్లో సిల్వర్ జూబ్లీలో రికార్డు సృష్టించింది. గుంటూరు విజయా టాకీసులో ఏకధాటిగా 380 రోజులు ప్రదర్శితమై మొన్నటి దాకా ఓ రికార్డుగా నిలచింది. విషాదాంత ప్రేమ కథలతో రూపొందిన చిత్రాలలో తెలుగునాట ఈస్థాయి విజయం చూసిన చిత్రం మరొకటి కానరాదు. అందువల్లే ఏయన్నార్ జనం మదిలో ‘ట్రాజెడీ కింగ్’గా నిలిచిపోయారు. ‘ప్రేమాభిషేకం’ ఘనవిజయం తరువాత నుంచీ అక్కినేని సినిమాల్లో ఏదో విధంగా ఓ విషాద గీతం చోటు చేసుకొనేలా చేయడం మొదలయింది. అలా “రాగదీపం, బంగారుకానుక, గోపాలకృష్ణుడు, మేఘసందేశం, అమరజీవి” వంటి చిత్రాలు రూపొందాయి. కానీ, ఏవీ ‘ప్రేమాభిషేకం’ స్థాయిలో అలరించలేకపోయాయి. ఏది ఏమైనా తెలుగునాట ‘ట్రాజెడీ కింగ్’ అనగానే అక్కినేని నాగేశ్వరరావే గుర్తుకు వచ్చేలా ఆయన అభినయ వైభవం సాగింది.