Netflix: పూర్వవైభవాన్ని పొందేందుకు నెట్‌ఫ్లిక్స్ ఏం చేస్తుందో తెలుసా?
Netflix India’s long-term strategy to attact Subscribers
నెట్‌ఫ్లిక్స్ సంస్థ గత ఏడాది కుదుపులకు లోనయింది. లక్షలాది మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. ఈ ఏడాది దిద్దుబాటు చర్యలకు దిగింది. కొత్త విధానంతో మార్కెట్‌లో ప్రవేశించనుంది. ఒక లాంగ్ టెర్మ్ ప్లాన్‌తో వీక్షకులకు దగ్గరయ్యేందుకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ అడుగులు వేస్తోందని సంస్థ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ తెలిపారు. కొత్త సభ్యులను ఆకర్షించడానికి, రాబడి పెంచుకోడానికి అనేక విధానాలను అవలంభిస్తున్నట్లు ఆమె తెలిపారు.
భారత వీక్షకుల అభిరుచులకు అనుగుణంగా అనేక కొత్త కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు. తద్వారా వారి నమ్మకాన్ని తిరిగి పొందేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె వివరించారు. భారత్ మార్కెట్‌పై మరింత ఫోకస్ పెట్టనున్నట్లు తెలిపారు.
2022 ఏడాది నెట్‌ఫ్లిక్స్ సంస్థకు గడ్డు కాలంగానే పరిగణించాలి. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా సబ్‌స్క్రైబర్లు తగ్గిపోయారు. మొదటి క్వార్టర్‌లో 2 లక్షల మంది, తర్వాత క్వార్టర్‌లో మరో 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను నెట్‌ఫ్లిక్స్ సంస్థ కోల్పోయింది. ప్రపంచ వ్యాప్తంగా అలా ఉంటే..ఇండియాలో వేరే విధంగా ఉంది. ఇక్కడ వీక్షకుల సంఖ్య పెరిగింది.
గతంలో యాడ్స్ లేకుండానే కంటెంట్ అందించిన నెట్‌ఫ్లిక్స్ తన పాలసీని మార్చుకుంది. గత ఏడాది నవంబర్ నుంచి యాడ్స్ కూడా ప్రసారం చేస్తోంది. ఆ విధానం అనుసరించి తక్కువ ధరలకే కంటెంట్ అందించడం ప్రారంభించింది. అదే విధంగా పాస్‌వర్డ్ షేరింగ్ విధానం కూడా తొలగించేందుకు నిర్ణయించింది.
ఇండియన్ మార్కెట్‌లో అనుకున్న విధంగా విజయం సాధించకపోవడంపై సీఈఓ రీడ్ హేస్టింగ్స్ 2021 ప్రారంభంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. నెట్‌ఫ్లిక్స్ వీక్షకులను పెంచేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో ధరలను కాస్త తగ్గించారు. 2021 నుంచి తగ్గింపు ధరలను అమలు చేస్తున్నారు. వీక్షకుల సంఖ్య 2022లో పెరిగింది. కొత్త కొత్త కంటెంట్‌తో వీక్షకుల కోసం కార్యక్రమాలను రూపొందించడం మొదలయింది.
థియేటర్లలో హంగామా చేసిన అనేక సినిమాలను కొనుగోలు చేసి ఓటీటీ వీక్షకులను నెట్‌ఫ్లిక్స్ అందించింది. RRR, కాంతార, గంగూభాయ్ కతియావాడీ, భూల్‌భులయ్యా, బీస్ట్ వంటి సినిమాలు నెట్‌ఫ్లిక్స్ వీక్షకులను అలరింపచేశాయి. ఈ సినిమాలన్నీఅంతర్జాతీయంగా కూడా ఓటీటీ ద్వారా మరింత పాపులర్ అయ్యాయి.
అలియాభట్‌కి చెందిన డార్లింగ్స్ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చూసిన ఇండియన్ మూవీగా ఖ్యాతి గాంచింది.
ఈ ఏడాది కూడా వీక్షకుల కోసం అనేక కొత్త సినిమా, వెబ్‌సిరీస్‌లతో నెట్‌ఫ్లిక్స్ ముందుకు రానుంది. తన పూర్వవైభవాన్ని పెంచుకుని పనిలో పడింది. ధరలను అందుబాటులోకి తెచ్చింది. భారత వీక్షకుడి అభిరుచులకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది.
బేర్ గ్రిల్స్ తో రణ్‌వీర్ సింగ్ అడవుల్లో చేసిన స్పెషల్ ప్రోగ్రామ్ నెట్‌ఫ్లిక్స్ వీక్షకులను కట్టిపడేసింది. ఆ షో ఎంతో విజయవంతం అయింది. అటువంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఈ ఏడాది కూడా అందించేందుకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ కృషి చేస్తోంది.
ఏ కాలీ కాలీ ఆంఖే అనే మ్యూజిక్ ప్రోగ్రామ్ గత ఏడాదిలో నెట్‌ఫ్లిక్స్ సంస్థలో సూపర్ హిట్ అయింది. అదే విధంగా మోనికా ఓ మై డార్లింగ్, కళా వంటి సినిమాలు కూడా వీక్షకులకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ అందించింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా వచ్చిన ఆ సినిమాలు కోట్లాది మందిని అలరించాయి.
సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో పాటు కామెడీ షోలు, రియాలిటీ షోలు, డాక్యుమెంటరీలు కూడా ఈ ఏడాది నుంచి మరింత ఎక్కువుగా రూపొందనున్నాయి. గత ఏడాదిలో ఢిల్లీ క్రైమ్ సీజన్ 2 ప్రేక్షకులను విశేషంగా అలరించింది.
నెట్‌ఫ్లిక్స్ సంస్థలో గత ఏడాది RRR హిందీ వెర్షన్ మూవీని 7 కోట్ల 30 లక్షల మంది వీక్షించారు. అదే విధంగా అలియా భట్ నటించిన గంగూభాయ్ కతియావాడీ సినిమాకు 5 కోట్ల మంది వీక్షించారు. భూల్‌భులయ్యా సినిమాను 2 కోట్ల మంది చూసి ఎంజాయ్ చేశారు.
2023లో తమ జైత్రయాత్ర కొనసాగుతుందని నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఇండియా ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్నామని, కొత్త కొత్త కంటెంట్‌తో ఈ ఏడాది మరింత అలరించనున్నామని చెబుతున్నారు. బ్లాక్ బస్టర్ సినిమాలను తమ వీక్షకులకు అందిస్తామని తెలిపారు. మరో 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను పెంచుకునే పనిలో ఉన్నామని తెలిపారు.వీక్షకులు చెల్లిస్తున్న డబ్బులకు తృప్తి పడేలా కంటెంట్ అందిస్తున్నామని నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఇండియా ప్రతినిధులు చెబుతున్నారు.
భారతదేశంలో ఇప్పటి వరకు విస్తరించని ప్రదేశాల్లో విస్తరించేందుకు కూడా నెట్‌ప్లిక్స్ అడుగులు వేస్తోంది. ఆయా ప్రాంతాలలో వీక్షలకు సంఖ్యను పెంచేందుకు ఏం చేయాలనే విషయంలో పలు ప్రణాళికలు రూపొందిస్తోంది.