Nandamuri Taraka Rama Rao: యుగ పురుషుడు ఎన్టీఆర్
Nandamuri Taraka Rama Rao:నందమూరి తారక రామారావు తెలుగు సినీ వినీలాకాశంలో ఓ సంచలనం… రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై ఆయన ఓ ప్రభంజనం..నటుడిగా ప్రజల గుండెల్లో కొలువైన దైవ రూపం…నాయకుడిగా ప్రజారంజక పాలనకు నిలువెత్తు రూపం. తెలుగు జాతి ఆత్మగౌరవం హస్తిన వీధుల్లో పరాభవానికి గురవుతున్న సమయంలో ఢిల్లీ అహంకారంపై తిరుగుబావుటా ఎగరేసి, తలఎత్తి తెలుగోడి సత్తా చాటిన ఆత్మగౌరవ పతాక ఎన్టీఆర్. రాజకీయ వారసత్వం లేదు ..తాతలు, తండ్రుల చరిత్ర లేదు ఉన్నదల్లా ప్రజాభిమానం ఒక్కటే. రంగేసుకునే వాళ్లకు రాజకీయాలేంటని విమర్శించిన నోళ్లనే ఔరా అనిపించేలా అడుగులేశారు.
నిమ్మకూరు ఆంధ్రప్రదేశ్ లో విజయవాడకు దగ్గర్లోని ఓ చిన్న పల్లెటూరు. పట్టుమని 500 ఇళ్లకు మించి ఉండని ఓ కుగ్రామం. ఆ పల్లె ఏ పుణ్యం చేసుకుందో.. ఏమో కానీ.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటి చెప్పిన కారణజన్ముడు..ఆ గ్రామంలో జన్మించారు. 1923 మే 28వ తేదీన సాయంత్రం నాలుగున్నర గంటలకు నందమూరి తారకరామారావు జన్మించారు. ఆయన తండ్రి లక్ష్మయ్య. తండ్రి వెంకట రామమ్మ. ఎన్టీఆర్ పుడుతూనే సిల్వర్ స్పూన్ తో పుట్ట లేదు. ఆయన జీవితంలో అనేక ఎత్తు పల్లాలు ఉన్నాయి. చిన్నతనం నుంచి ఆయనకు నటనంటే ప్రాణం. ఆ కారణంగానే ఆయన సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం కూడా వదులుకున్నారు. ఆ తర్వాత సినీరంగం పై దృష్టి సారించారు.
ఎన్టీఆర్ ఏ పాత్ర చేసినా గుండెలకు హత్తుకుంటుంది.. ఏ డైలాగు చెప్పినా ఆలోచింపజేస్తుంది.. దేశం గర్వించదగిన నటులలో అగ్రస్థానంలో ఉంటారు.. ఆ పాత్ర ఈ పాత్ర అని లేదు. పౌరాణిక , జానపద, సాంఘీక చిత్రాలలోని వైవిధ్యమైన మరపురాని పాత్రలకు ఆయనే చిరునామా. రాముడైనా-రావణుసురుడైనా.. కృష్ణుడైనా-ధుర్యోధనుడైనా.. కర్ణుడైనా-అర్జునుడైనా ఇలా ఏ పౌరాణిక పాత్ర పోషించినా ఆయనదో ప్రత్యేకమైన శైలి. అందుకే తెలుగు వారి హృదయాలలో ఆరాధ్య దైవంగా నిలిచాడు. 1982 మార్చి 29న తెలుగు దేశం పార్టీ ఏర్పాటును ప్రకటించారు ఎన్టీఆర్. ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన గొప్ప నేత ఎన్టీఆర్.
పార్టీని ప్రకటించి.. చైతన్య రథాన్ని సిద్దం చేసి.. ఓట్లేయండని జనంలోకి వచ్చారు. ఆయనకి జనం నీరాజనాలు పలికారు. ఎన్టీఆర్ ప్రతి మాట ఓ తూటాగా పేలింది. కాంగ్రెస్ పార్టీ వల్ల.. తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదని దానిని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శిస్తూ, ఆ ఆత్మగౌరవ పునరుద్ధరణకే తాను రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల అప్పటికే విసుగు చెందిన ప్రజలు ఆయన నినాదం పట్ల ఆకర్షితులయ్యారు. అలా కొద్ది రోజుల్లోనే మహా ప్రభంజనంలా మారిన తెలుగుదేశం ఆవిర్భవించిన తొమ్మిది నెలలకే 1983 ఎన్నికల్లో 199 స్థానాలతో ఘన విజయం సాధించింది. తొలి కాంగ్రెసేతర సీఎంగా… తనను ఆదరించిన ప్రజల సమక్షంలోనే ప్రమాణస్వీకారం చేశారు. రంగేసుకునే వాడికి రాజకీయం ఏం తెలుస్తుందన్న ప్రత్యర్థుల విమర్శలకు పాలనతో, పథకాలతో సమాధానం చెప్పారు. పాలనలో పారదర్శకత, నీతి నిజాయతీలకు మారు పేరుగా నిలిచారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్లారు
ఎన్టీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయమూ ఒక సంచలనం. ప్రవేశ పెట్టిన ప్రతి పథకం ఓ ప్రభంజనం. ప్రతి పేదోడి కడుపు నింపాలన్న సదాశయంతో రెండ్రూపాయలకే కిలో బియ్యమిచ్చి చరిత్ర సృష్టించారు ఎన్టీఆర్. ఇక జనతా వస్త్రాల పథకంతో ప్రతి పేదవాడికీ కనీస అవసరమైన వస్త్రాలను అందించారు. ఇక అప్పట్లోనే బడుగు వర్గాలకు లక్షలాదిగా ఇళ్లు కట్టించి కొత్త సంచలనానికి తెర తీశారు. పేదల కనీస అవసరాలైన… రోటీ కపడా ఔర్ మకాన్లకు ఎక్కడా లోటు లేకుండా చూశారు. స్త్రీలకు కూడా ఆస్తిలో హక్కు కల్పిస్తూ అన్నగారు తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇక సంపూర్ణ మద్యపాన నిషేధంతో మహిళల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తెలుగులోనే అన్ని పాలనా వ్యవహారాలు సాగేలా నిర్ణయం తీసుకున్నారు.
1984 ఆగష్టులో నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ తెలుగునాట మరో చరిత్ర. రామారావును అధికారం నుంచి తొలగించి, తాను దొడ్డిదారిన నాదెండ్ల భాస్కరరావు గద్దెనెక్కారంటూ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పేరుతో తిరిగి రామారావు ప్రజల్లోకి వెళ్ళారు. జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు. ఫలితంగా రామారావు తిరిగి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. ఇక 1985-89 మధ్య కాలంలో ఎన్టీఆర్ పరిపాలన పరంగా కొంత అప్రదిష్టను మూట గట్టుకున్నారు. మొండిగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు 1989 ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశాన్ని ఓడించి తిరిగి అధికారంలోకి వచ్చింది. అదే ఎన్నికల్లో హిందూపురం నుంచి.. కల్వకుర్తి నుంచి పోటీ చేసిన ఎన్టీఆర్ కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన 1994 ఎన్నికల్లో కిలో బియ్యం రెండు రూపాయలు, సంపూర్ణ మద్య నిషేధం, వంటి హామీలతో, మునుపెన్నడూ ఏపార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. 1994 ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఎన్టీఆర్ తన పదవీ కాలం పూర్తి కాకుండానే పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. పదవి కొల్పోయిన అనంతరం 1996 జనవరి 18న గుండెపోటుతో మరణించారు.ఈ రోజు ఆ మహా నటుడి, మహా నాయకుడి, మహా పురుషుడి వర్ధంతి. తను మే 28, 1923 ఈ జగమనే నాటకరంగంలో అడుగుపెట్టి తన పాత్రను అద్బుతంగా పోషించి..జనవరి 18, 1996 నాడు నిష్క్రమించాడు. ఎన్టీఆర్ ఒక గొప్ప నటుడు, గొప్ప ప్రజానాయకుడు.