‘కృష్ణ వ్రింద విహారి’ నుంచి ఏముంది రా సాంగ్ విడుదల
యంగ్ హీరో నాగ శౌర్య, షెర్లీ సెటియా జంటగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఐరా క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన స్పెషల్ పోస్టర్స్, టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఏముంది రా’ అనే రెండో పాట లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
‘ఏముంది రా.. ఈ అద్భుతాన్ని చూడు.. మారింది రా.. అందం చరిత్ర నేడు..’ అంటూ సాగిన ఈ సాంగ్ శ్రోతలను అలరిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ పాటను హరిచరణ్ ఆలపించారు. ఈ లిరికల్ వీడియోలో చూపించిన విజివల్స్ కూడా ఎంతో అందంగా ఉన్నాయి. ఈ పాటలో నాగశౌర్య, షిర్లీని అగ్రహారానికి తీసుకురావడం, ఆమె సాంప్రదాయ బ్రాహ్మణ అమ్మాయిగా కనిపించడం, హల్దీ ఫంక్షన్ మొదలుకొని పెళ్లి, సీమంతం, పిల్లలు.. ఇలా హ్యాపీ మూమెంట్స్‌ని పాటలో చూపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో నాగ శౌర్య హిట్ అందుకుంటాడా..? లేదా..? అనేది చూడాలి.