చిత్ర సీమలో విషాదం: సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత
తెలుగు చిత్ర సీమలో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు బాలయ్య ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. ఇదే రోజు ఆయన పుట్టినరోజు కూడా. పుట్టినరోజు నాడే ఆయన కన్నుమూయడం బాధాకరం. గత కొంత కాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. యూసఫ్ గూడలోని తన స్వగృహంలో బాలయ్య తుదిశ్వాస విడిచారు. నటుడిగా 300కి పైగా చిత్రాల్లో నటించారు. ‘ఎత్తుకు పైఎత్తు’ చిత్రంతో నటుడు అయ్యారు. నిర్మాతగా, దర్శకుడుగా, కథా రచయితగా తన ప్రతిభ చూపారు. ఆయన నిర్మాతగా పలు ప్రతిష్టాత్మక చిత్రాలు నిర్మించారు. అమృత ఫిల్మ్స్ సంస్థ ద్వారా శోభన్ బాబు హీరోగా చెల్లెలి కాపురం, సూపర్ స్టార్ కృష్ణ హీరో కె. విశ్వనాథ్ దర్శకుడుగా నేరము – శిక్ష, చుట్టాలున్నారు జాగ్రత్త లాంటి చిత్రాలు బాలయ్య నిర్మించారు. దర్శకుడుగా ఆయన పసుపు తాడు, పోలీసు అల్లుడు రూపొందించారు. ఉత్తమ కథా రచయితగా ఊరికిచ్చిన మాట చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా నంది అవార్డు అందుకున్నారు. బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. కాగా బాలయ్య మృతికి పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
నిర్మాతగా కొనసాగుతున్న సమయంలోనే బాలయ్య నటునిగానూ మెప్పించారు. ‘నామాల తాతయ్య’లో శ్రీనివాసుని పాత్రలో నటించారు. ఇక ‘భక్త కన్నప్ప, జగన్మాత’ వంటి పురాణగాథల్లో శివునిగా మెప్పించారు. అనేక జానపద, చారిత్రక, పౌరాణికాల్లో ప్రముఖ పాత్రలే ధరించారు. అయినప్పటికీ బాలయ్య పేరు వినగానే ఆయన పోషించిన కేరెక్టర్ రోల్స్ ముందుగా గుర్తుకు వస్తాయి. యన్టీఆర్ తో కడదాకా బాలయ్యకు మంచి అనుబంధం ఉండేది. యన్టీఆర్ చివరి చిత్రంగా తెరకెక్కిన ‘మేజర్ చంద్రకాంత్’లోనూ ఆయన మిత్రునిగా నటించారు బాలయ్య. ఇక యన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణతోనూ బాలయ్య కొన్ని చిత్రాలలో అభినయించారు. బాలకృష్ణ నటించిన బాపు ‘శ్రీరామరాజ్యం’లో వశిష్టుని పాత్రలో కనిపించారు బాలయ్య. గత కొంతకాలంగా వయసు సహకరించక పోవడంతో నటనకు కూడా దూరంగా ఉన్నారు.