దుబాయ్ లో రాజమౌళి, మహేష్ ల సీక్రెట్ భేటీ.. కారణం ఏంటి..?
‘ఆర్ఆర్ఆర్’ సినిమా విజయంతో దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న విషయం విదితమే. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ ఆదివారం రాజమౌళి, మహేష్ బాబు ఇద్దరు దుబాయ్ కి వెళుతూ హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. దీంతో భేటీపై రకరకాల గుసగుసలు వైరల్ అయిపోతున్నాయి. ఎందుకు ఈ ఇద్దరు దుబాయ్ లో మీట్ కానున్నారు అనేది అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.
అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పటికే పలు కథలను రాజమౌళి, మహేష్ కి వినిపించినా ఏదీ ఖరారు చేయలేదట.. దీంతో ఆ ఇద్దరూ సీరియస్ గా ఇకపై తమ ప్రాజెక్ట్ పై దృష్టి సారిస్తున్నారని, కథా చర్చలు సాగించేందుకే ఇప్పుడు దుబాయ్ వెళుతున్నారని గుసగుస వినిపిస్తోంది. ఇక ఆ ఇద్దరితో పాటు రచయితల బృందం కూడా దుబాయ్ వెళుతున్నారా? అన్నదానికి సమాధానం రావాల్సి ఉంది. ఇక దుబాయ్ ప్రయాణంలో మహేష్, తన కుటుంబాన్ని తీసుకెళ్లకపోవడం విశేషం. మరి ఈసారి అయినా రాజమౌళి మంచి కథతో మహేష్ ని మెప్పిస్తాడో.. లేదో..? చూడాలి.