Nagarjuna Birthday Special:టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో కింగ్ నాగార్జున శైలి ప్రత్యేకం. అక్కినేని నటవారసుడిగా సినిమాల్లోకి ప్రవేశించినా కెరీర్ ప్రారంభం నుంచి తనదైన శైలి సినిమాలతో విలక్షణమైన కథలతో ప్రయోగాలు చేస్తూ `సెల్యూలాయిడ్ సైంటిస్ట్` అనిపించుకున్నారు. మూసథోరణికి భిన్నంగా అడుగులూ వేస్తూ నిత్యం కొత్తదనాన్ని, కొత్త దర్శకులని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ వస్తున్నారు.
Nagarjuna Birthday Special:టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో కింగ్ నాగార్జున శైలి ప్రత్యేకం. అక్కినేని నటవారసుడిగా సినిమాల్లోకి ప్రవేశించినా కెరీర్ ప్రారంభం నుంచి తనదైన శైలి సినిమాలతో విలక్షణమైన కథలతో ప్రయోగాలు చేస్తూ `సెల్యూలాయిడ్ సైంటిస్ట్` అనిపించుకున్నారు. మూసథోరణికి భిన్నంగా అడుగులూ వేస్తూ నిత్యం కొత్తదనాన్ని, కొత్త దర్శకులని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ వస్తున్నారు. బాలనటుడిగా తండ్రి అక్కినేని సినిమాతో ఎనిమిది నెలల వయసులో కెరీర్ ప్రారంభించిన నాగార్జున ఇన్నేళ్ల కెరీర్లో ఇప్పటికీ వెండితెరపై ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇండస్ట్రీకి కొత్త టాలెంట్‌ని పరిచయం చూస్తూ వస్తున్నారు. స్టార్ డైరెక్టర్స్‌ని ఎంచుకోకుండా కొత్త వాళ్లని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ వారినే స్టార్స్‌గా మలిచిన ఘనత కింగ్ నాగార్జున సొంతం.ఇండస్ట్రీకి ఆయనో ట్రెండ్ సెట్టర్. ట్రెండ్‌ని ఫాలో కాకుండా సరికొత్త ట్రెండ్‌ని సెట్ చేసి ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్లని, టెక్నీషియన్లని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. హీరోగానే కాకుండా నిర్మాతగానూ ప్రయోగాలు చేసిన కింగ్ ప్రస్తుతం బుల్లితెరపైనా సత్తా చాటుతున్నారు. నేడు సెల్యూలాయిడ్ కింగ్ నాగార్జున పుట్టిన రోజు. నేడు 64వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.
ఊహతెలియని వయసులో..
నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు – అన్నపూర్ణ దంపతులకు 1959 ఆగస్టు 29న మద్రాసులో నాగార్జున జన్మించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌లో స్థిరపడటంతో అక్కినేని ఫ్యామిలీ హైదరాబాద్‌లో స్టిరపడింది. దీంతో నాగ్ స్కూలింగ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జరిగింది. మద్రాస్ అన్నా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చదివిన నాగ్ ఈస్టర్న్ మిచిగాన్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారు. అయితే నాగ్ సినీ రంగ ప్రవేశం ఆయనకు తెలియకుండానే జరిగింది. ఊహ తెలియని ఎనిమిదేళ్ల వయసులో 1961లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన `వెలుగు నీడలు` సినిమాతో బాల నటుడిగా పరిచయం అయ్యారు. ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన `సుడిగుండాలు`లోనూ బాల నటుడిగా మెరిశారు.
`విక్రమ్`తో హీరోగా ఎంట్రీ..
చైల్డ్ ఆర్టిస్ట్‌గా `వెలుగు నీడలు`, `సుడిగుండాలు` సినిమాలతో ఆకట్టుకున్న నాగార్జున తొలి సారి హీరోగా అరంగేట్రం చేసిన సినిమా `విక్రమ్`. 1986లో విక్టరీ మధుసూదనరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని వెంకట్ ఈ సినిమాని నిర్మించారు. శోభన హీరోయిన్గా నటించిన `విక్రమ్` నాగార్జునకు మంచి పేరు తెచ్చి పెట్టి అక్కినేని నట వారసుడిగా నిలబెట్టింది. తొలి నాళ్లలో నాగార్జున వాయిస్ చాలా పేలగా ఉందనే విమర్శలు వినిపించాయి. అంతే కాకుండా హీరో చాలా వీక్‌గా ఉన్నాడని కూడా కామెంట్లు చేశారు. అయితే అవన్నింటినీ అధిగమించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూనే రొమాన్స్‌కు కింగ్ అనిపించుకున్నారు నాగార్జున. అప్పటికీ ఇప్పటికీ రొమాంటిక్ సినిమాలకు అక్కినేని ఫ్యామిలీ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచేలా చేశారు.
మజ్ను సినిమాతో రొమాంటిక్ బాట పట్టిన నాగ్ ఆ తరువాత సంకీర్తనతో మంచి పేరు తెచ్చుకున్నారు. తండ్రితో కలిసి కలెక్టర్ గారి అబ్బాయి, `అగ్నిపుత్రుడు` వంటి సినిమాలు చేశారు. శ్రీదేవితో `ఆఖరి పోరాటం`, రాధతో `విక్కీ దాదా` వంటి సినిమాలు చేసిన నాగ్ కెరీర్‌ని ఒక్కసారిగా మలుపుతిప్పిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ `గీతాంజలి`. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నాగ్ కెరీర్లో క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచింది. జాతీయ పురస్కారాల్లో ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమాగా అవార్డుని సొంతం చేసుకుంది. 1989లో వచ్చిన ఈ సినిమాలో నాగార్జున గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. అయితే ఒకే జోనర్‌కు ఫిక్సయిపోకుండా భిన్నమైన జోనర్లతో సినిమాలు చేశారు.
`శివ`తో ట్రెండ్ సెట్టర్‌గా…
తన కెరీర్లో ప్రయోగాలకు పెద్ద పీట వేసిన నాగార్జున టాలెంటెడ్ డైరెక్టర్లని ఇండస్ట్రీకి పరిచయం చేయడం మొదలు పెట్టారు. ఆ క్రమంలోనే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఎలాంటి అనుభవం లేకపోయినా అతను చెప్పిన కథ, కథనాలని నమ్మి `శివ` సినిమాతో దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. అదే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన తెలుగు సినిమాలో సంచలనం సృష్టించింది. తెలుగు సినిమాలో సరికొత్త ట్రెండ్‌ని సృష్టించి ట్రెండ్ సెట్టర్ అనిపించుకుంది. అంత వరకు ఓ ఫార్ములాతో సాగుతున్న తెలుగు సినిమా `శివ`తో కొత్త బాట పట్టింది. అంతే కాకుండా కింగ్ నాగార్జునకు స్టార్ డమ్‌ను తెచ్చి పెట్టింది. ఈ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన నాగార్జున ఇదే `శివ`తో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అక్కడ కూడా `శివ` కొత్త ట్రెండ్‌ని సెట్ చేసి సంచలనంగా మారింది. అక్కడి నుంచి కింగ్ వరుసగా ప్రయోగాలు చేస్తూ కొత్త దర్శకులని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ బ్లాక్ బస్టర్ లని సొంతం చేసుకుంటూ వచ్చారు. దీంతో ఆయనని అంతా `సెల్యూలాయిడ్ సైంటిస్ట్`గా అభివర్ణించడం మొదలు పెట్టారు.
పాన్ ఇండియాకు ఆద్యుడు..
ఇప్పుడు అంతా పాన్ ఇండియా అని చెప్పుకుంటున్నారు కానీ అప్పట్లోనే పాన్ ఇండియా సినిమాలు చేసిన స్టార్ నాగార్జున. 1991లో కన్నడ హీరో రవిచంద్రన్ రూపొందించిన `శాంతి క్రాంతి`, మహేష్ భట్ డైరెక్ట్ చేసిన `క్రిమినల్` సినిమాలు పాన్ ఇండియా స్థాయి చిత్రాలే కావడం విశేషం. బిగ్ బి అమితాబ్ బచ్చన్, శ్రీదేవితో కలిసి నటించిన `ఖుదాగవా` కూడా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదలై ఘన విజయం సాధించింది. కె.టి. కుంజుమోన్ నిర్మాణంలో ప్రవీణ్ గాంధీ రూపొందించిన `రక్షకుడు` కూడా బైలింగ్వల్ సినిమా అన్నది తెలిసిందే. ఇందులో తొలిసారి మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో నాగ్ రొమాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. పరాజయాలకు వెరవకుండా ప్రయోగాలు చేస్తూ అప్పట్లోనే బైలింగ్వల్ సినిమాల్లో నటించిన పాన్ ఇండియా స్టార్ నాగార్జున.
గ్రీకు వీరుడు భక్తుడిగా మారి..
కింగ్ నాగార్జున అంటే ఓ గ్రీకు వీరుడు.. అమ్మాయిల కలల రాకుమారుడు..రొమాంటిక్ ఇమేజ్ ఉన్న హీరో. ఇవన్నింటినీ బ్రేక్ చేస్తూ గ్రీకు వీరుడిని భక్తుగడా మార్చిన ఆశ్చర్యపరిచిన సినిమా `అన్నమయ్య`. ఇది నాగార్జున తన కెరీర్లో చేసిన మరో సాహసం. రొమాంటిక్ హీరోతో `అన్నమయ్య`..ఏమైనా అర్థం ఉందా? ..అంతా నవ్విపోరూ.. అని ఈ సినిమా ప్రకటించిన సమయంలో అంతా విమర్శలు చేశారు. నాగార్జున అన్నమయ్య ఏంటీ? ..రాఘవేంద్రరావుకు ఏమైనా మతి భ్రమించిందా? అన్నారు. అయితే 1997లో రాఘవేంద్రరావుపై ఉన్న నమ్మకంతో `అన్నమయ్య`గా ముందడుగేశారు నాగార్జున. సినిమా రిలీజ్ వరకు ఎన్నో విమర్శలు చేసిన వారే సినిమాలో నాగ్ నటనకు మంత్రముగ్ధులయ్యారు. ప్రశంసల వర్షం కురిపించారు. రొమాంటిక్ హీరోగా వెండితెరపై మెరిసి ఆ వెంటనే భక్తుడిగా ఆకట్టుకోవడం నాగార్జునకే సాధ్యం అయింది.
బుల్లితెరపై హోస్ట్‌గా..
వెండితెరపై గ్రీకువీరుడిగా ఆకట్టుకుంటూ శివ, గీతాంజలి వంటి ట్రెండ్ సెట్టర్లని అందించిన సెల్యూలాయిడ్ సైంటిస్ట్ అనిపించుకున్న నాగార్జున సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై హోస్ట్‌గానూ తన సత్తా చాటుకుంటున్నారు. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కు హోస్ట్‌గా వ్యవహరిస్తూ తనకు తానే సాటి అనిపించుకుంటున్నారు. త్వరలో ప్రారంభం కానున్న సీజన్ 7కు కూడా ఆయనే హోస్ట్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. నటుడిగా కెరీర్ ప్రారంభించి ఆరు దశాబ్దాలు అవుతున్నా హీరోగా ఆయన కెరీర్ ప్రారంభించి 37 ఏళ్లు కావస్తోంది. ఇంత కాలంగా సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది అత్యుత్తమ దర్శకులని, టెక్నీషియన్లని పరిచయం చేసిన నాగార్జున ఇప్పటి వరకు 98 సినిమాలు చేశారు. ఉత్తమ నటుడిగా 4 నందిపురస్కారాలు అందుకున్న నాగ్ త్వరలో తన 100 సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. దీని ద్వారా ఈ సినిమాతో రచయిత ప్రసన్న కుమార్ బెజవాడని దర్శకుడిగా పరిచయం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ రోజే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. హీరోగా, నిర్మాతగా ఎన్నో విజయాల్ని దక్కించుకున్న నాగార్జున ఇప్పటికీ కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తూ దర్శకులుగా పరిచయం చేస్తున్నారు. తెలుగు సినిమాకు ఎంతో మంది టాలెంటెడ్ పీపుల్స్‌ని పరిచయం చేసిన కింగ్ నాగ్ ఇలాగే మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సరికొత్త విజయాలని అందించాలని కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది `mycityhyderabad.in`