IMDB Top 10 Movies 2022: అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాల జాబితా, సౌత్ ఇండియా సినిమాలదే హవా
కరోనా వల్ల సగటు ప్రేక్షకుడు మళ్లీ థియేటర్‌కు వస్తాడా? లేదా? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ జనాలని థియేటర్స్ కి పరుగులు పెట్టించాయి కొన్ని సినిమాలు. ఇలా ఆడియన్స్, క్రిటిక్స్ ఇద్దరినీ మెప్పించే చిత్రాలు I.M.D.B రేటింగ్స్ లో అగ్రస్తానం దక్కించుకుంటాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫిలిం రేటింగ్ వెబ్‌సైట్‌గా ప్రసిద్ధి గాంచిన ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ I.M.D.B ఈ సంవత్సరంలో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో జనవరి 1, 2022 నుండి జూలై 5, 2022 మధ్య విడుదల చేయబడిన భారతీయ చిత్రాలు ఉన్నాయి. అయితే ఈ జాబితాలో సౌత్ మూవీస్ హవా కనిపించింది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2, విక్రమ్ చిత్రాలు సౌత్ నుండి టాప్ -10 లో స్తానం దక్కించుకోగా, కమల్ హాసన్ విక్రమ్ మూవీ టాప్ పొజిషన్లో నిలిచింది.
విక్రమ్
విలక్షణ నటులు కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్-థ్రిల్లర్ విక్రమ్. 1986లో రిలీజ్ అయినా కమల్ యాక్షన్ మూవీ విక్రమ్ లోని గూఢచారి పాత్ర యొక్క స్పిన్-ఆఫ్ ఈ విక్రమ్. నార్కోటిక్స్ డ్రగ్స్ ముఠాని మట్టికరిపించి రిటైర్డ్ ‘రా’ ఏజెంట్ విక్రమ్‌లో చూపెట్టిన సాహసాలకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 8.8/10 రేటింగ్‌తో IMDBలో మొదటిస్థానంలో నిలిచింది.
కేజిఎఫ్. 2
దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండవ విడత గ్యాంగ్‌స్టర్ సాగా కేజిఎఫ్ 2 ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులని తిరగరాసింది. రాక్‌స్టార్ యష్ నటించిన రాకీ, సంజయ్ దత్ పోషించిన అధీర పాత్రల మధ్య నడిచే భీకర యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన కేజిఎఫ్ 2 తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ సహా పలు భాషల్లో విడుదలయింది. విడుదలైన ప్రతి చోటా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రకాష్ రాజ్, మాళవిక, అవినాష్ , శ్రీనిధి శెట్టి నటించిన ఈ సినిమా 8.5/10 రేటింగ్‌తో IMDB లో రెండవ స్థానంలో నిలిచింది.
ద కశ్మీర్ ఫైల్స్
కరోనా తరువాత బాలీవుడ్లో కాసుల వర్షం కురిపించిన మొదటి చిత్రం.. వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ద కశ్మీర్ ఫైల్స్. విడుదలైన మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది కశ్మీర్ ఫైల్స్. బాలీవుడ్ దిగ్గజాలు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తిలతో సహా దర్శన్ కుమార్, పల్లవి జోషి, చిన్మయ్ మాండ్లేకర్ వంటి ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు నటించిన ఈ చిత్రం 80- 90ల చివరలో లోయ నుండి పారిపోవడానికి బలవంతంగా ప్రయత్నించిన కశ్మీరీ పండిట్ల కథనే ద కశ్మీర్ ఫైల్స్. 11 మార్చి 2022న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం IMDB రేటింగ్ 8.3.
హృదయం
వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మలయాళ ప్రేమకావ్యంలో ప్రణవ్ మోహన్ లాల్, కళ్యాణి ప్రియదర్శన్, దర్శన రాజేంద్రన్ నటించారు. వీరి ముగ్గురి మధ్య సాగే ట్రయాంగులర్ లవ్ డ్రామా ఇది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండే కాక విమర్శకులు నుండి సానుకూల స్పందన లభించింది. ఈ చిత్రంలో కాలేజీ లైఫ్ నుండి తండ్రి అయ్యే వరకు జరిగే అరుణ్ నీలకందన్ అనే యువకుడి జర్నీని ఎంతో హృద్యంగా తెరకెక్కించారు. ఈ సినిమాకి I.M.D.B ఇచ్చిన రేటింగ్ 8.1.
ఆర్.ఆర్.ఆర్
మన జక్కన్న చెక్కిన మరో అద్భుత శిల్పం ఆర్ఆర్ఆర్. ఖర్చుకి వెనుకాడకుండా పాన్ ఇండియా రేంజిలో తీసిన ఈ సినిమా ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల కెరీర్‌ని మరో లెవెల్లో నిలబెట్టింది. రాత్రికి రాత్రి ఈ ఇద్దరు సూపర్ హీరోలు పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. భారతదేశ స్వాతంత్రం కోసం చేసిన తిరుగుబాటు పోరులో కుటుంబాన్ని పోగొట్టుకున్నా.. తన తండ్రి ఆశయం కోసం బ్రిటిషర్ల దగ్గర గూఢచారిగా పనిచేసే రామ్ చరణ్, తన గోండు జాతి బిడ్డను కాపాడి మన్యానికి తీసుకెళ్లాలనుకునే ఎన్టీఆర్‌ల మధ్య స్నేహమే ఆర్ఆర్ఆర్. వీరిద్దరి స్నేహం స్క్రీన్ పై అద్భుతంగా పండటంతో దేశవ్యాప్తంగా ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యారు. అజయ్ దేవగన్, అలియా భట్, శ్రియా శరన్, ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ నటించిన ఈ సినిమా I.M.D.B రేటింగ్ 8.0తో టాప్ 5 లో నిలిచింది.
టాప్ 10లో నిలిచిన చివరి 5 చిత్రాలు
ఇక ఎ థర్స్ డే 7.8/10, ఝండ్: 7.4/10, సామ్రాట్ పృథ్వీరాజ్: 7.2/10, రన్‌వే 34: 7.2/10, గంగూబాయి కథియావాడి: 7/10 చిత్రాలు వరుసగా I.M.D.B రేటింగ్స్ లో తరువాతి స్థానాల్లో నిలిచాయి.