Anurag Thakur: చిరంజీవితో భేటీపై మంత్రి అనురాగ్ ఠాకుర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Grateful for your insights into the world of cinema, Anurag Thakur thanks Chiranjeevi team
మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్ వంటి సినీ ప్రముఖులను కలిసి సినిమా రంగంపై చేసిన చర్చలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ సంతోషం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. మిమ్మల్ని,మీతో పాటు నాగార్జున, అల్లు అరవింద్ లను కలవడం ఎంతో సంతోషంగా ఉందని, సినిమా గురించి మీరందించిన సమాచారానికి ఎంతో ధన్యవాదాలు అంటూ అనురాగ్ ఠాకుర్ ట్వీట్ చేశారు. మీ కళ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి స్పూర్తిని అందిస్తున్నారని ప్రశంసించారు.
గత ఏడాది మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం జరిగిన సందర్భంగా చిరంజీవికి ఈ అవార్డు అందించారు. ఆ అవార్డు ఫంక్షన్ జరిగిన నాటి నుంచి కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ చిరంజీవితో టచ్ లో ఉన్నారు. పలు సందర్భాల్లో పలకరింపులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
మంత్రి అనురాగ్ ఠాకుర్ తన నివాసానికి వచ్చి కలిసిన విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనను కలవడానికి సమయం కేటాంయించిన మంత్రికి మెగాస్టార్ ధన్యవాదాలు తెలిపారు. భారత చిత్ర పరిశ్రమలో వస్తున్న మార్పుల విషయంలో సోదరుడు నాగార్జునతో కలిసి మేమందరం చర్చించిన విషయాలు ఎంతో సంతోషం కలిగించాయని మెగాస్టార్ ట్వీట్ చేశారు.
చిరంజీవితో నిరంతరం టచ్ లో ఉండడం ద్వారా చిరంజీవిని బీజేపీలోకి ఆహ్వానించే పని నెమ్మదిగా జరుగుతోందని పలువురు పరిశీలకులు భావిస్తున్నారు. సినీ తారలను, క్రికెట్ స్టార్లను తమ పార్టీ ప్రయోజనాలకు వీలుగా ఉపయోగించుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఆ క్రమంలోనే చిరంజీవికి మరింత దగ్గర అవుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.