Oscar Race: ఆస్కార్’ దిశగా జక్కన్న రాజమౌళి జైత్రయాత్ర.. రేసులో ముందడుగు..
Director Rajamouli in Oscar Race: తెలుగు సినిమా జక్కన్న.. దక్షిణా భారత సినిమా జేమ్స్ కామెరాన్.. భారత చలనచిత్ర పరిశ్రమ స్పీల్ బర్గ్.. మనందరం ఎంతో గౌరవంగా చెప్పుకొనే.. దర్శక ధీరుడు అంటూ గొప్పగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మక సినీ పురస్కారం ‘‘ఆస్కార్’’ రేసులో ముందంజ వేశారు. ఏ అవార్డు వచ్చిందని చెబితే మనం పొంగిపోతామో.. ఏ అవార్డుకు నామినేట్ అయిందని తెలిసినా సంబరపడిపోతామో ఆ అవార్డుకు మరింత దగ్గరగా వెళ్లారు జక్కన్న. ఆస్కార్ అవార్డు గెలిచిన సినిమాను అప్పటికే ఓసారి చూసి ఉన్నప్పటికీ.. అవార్డు వచ్చాక మరోసారి చూసే అభిమానులు ఎందరో?
ప్రపంచంలో మరే సినీ అవార్డుకూ లేనంత క్రేజ్ ఆస్కార్ సొంతం. దీనిపై ఎన్నో విమర్శలుండవచ్చు గాక.. కానీ అవేవీ గట్టిగా వాదనకు నిలిచేవి కావు. కాగా, ఈసారి ఆస్కార్ అవార్డుల నామినేషన్లను ఈ నెల 24న ప్రకటించనున్నారు. భారతీయ కాలమానం ప్రకారం జనవరి 25వ తేదీ తెల్లవారు జామున ఈ ప్రకటన ఉంటుంది. అయితే, మన దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నామినేషన్స్ పైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది. కారణం.. జక్కన్న చెక్కిన తాజా శిల్పం ‘‘ఆర్ఆర్ఆర్’’. ఇప్పటికే కొన్ని ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డుల్లో జయకేతనం ఎగురవేసి.. ఆస్కార్ గడప తొక్కిన ఆర్ఆర్ఆర్.. ఈ నెల 24 ప్రకటించబోయే నామినేషన్లనూ దక్కించుకుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆస్కార్ అవార్డుల ప్రదానం ముంగిట భారీ అంచనాలున్న నేపథ్యంలో.. ఎవరికి నామినేషన్స్ దక్కుతుంది? అంటూ ‘లాస్ ఏంజెలిస్ టైమ్స్’ పత్రిక ఓ సర్వే నిర్వహించింది. ఇందులో ఉత్తమ దర్శకుడు (బెస్ట్ డైరెక్టర్) కేటగిరీలో అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ రాజమౌళి ప్రథమస్థానంలో నిలిచారు. ఆస్కార్ అవార్డుల్లో 24 విభాగాలు ఉన్నాయి. వాటిలో ఏ కేటగిరీలో నామినేషన్ సంపాదించినా, సినీజనం ఎంతో గర్విస్తూ ఉంటారు. ఆస్కార్ పురస్కారాల్లో.. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్ ప్లే.. ఈ ఐదు అంశాలు టాప్ కేటగిరీలో ఉంటాయి. వీటిని గెలుచుకున్నవారికి కాసింత ఎక్కువ ప్రాధాన్యమూ ఉంటుంది. ఇలాంటి సమయంలో రాజమౌళి.. ఉత్తమ దర్శకుడు కేటగిరీలో దూసుకెళ్తున్నారు. ఏ భారతీయ దర్శకునికీ సాధ్యం కాని గౌరవాన్ని పొందే మార్గంలో ఉన్నారని ‘లాస్ ఏంజెలిస్ టైమ్స్’ సర్వే చెబుతోంది. కాగా, ఆస్కార్ నామినేషన్స్ సంపాదించే దర్శకులు ఎవరు? అన్న అంశంపై ఓటింగ్ లో ప్రపంచంలోని నలుమూలల ఉన్న నెటిజన్స్ పాల్గొన్నారు.
రాజమౌళి ఆరాధ్య దర్శకుడు స్పీల్ బర్గ్. ఇటీవలే ఆయన్ను కలిసిన సందర్భంలో ఎంతో పొంగిపోయారు దర్శక ధీరుడు. ఇక అవతార్ సిరీస్ దర్శకుడు కామెరాన్ గురించి కూడా గొప్పగా చెబుతారు. త్రమేమంటే.. వీరిద్దరినీ వెనక్కునెట్టి ఉత్తమ దర్శకుడు విభాగంలో రాజమౌళి పోటీలో ముందు నిలిచారు. ‘లాస్ ఏంజెలిస్ టైమ్స్’ సర్వే ప్రకారం.. ‘ట్రిపుల్ ఆర్’ దర్శకునిగా రాజమౌళికి 18 శాతం ఓట్లు రాగా, ‘ద ఫ్యాబుల్మన్స్’ సినిమా డైరెక్టర్ గా స్టీవెన్ స్పీల్ బెర్గ్ కు 16 శాతం ఓట్లు లభించాయి. ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్’ సినిమా దర్శకులు డాన్ క్వాన్, డేనియెల్ షూనెర్ట్ కు 13 శాతం ఓట్లు, ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ మూవీతో జేమ్స్ కేమరాన్ కు 12 శాతం ఓట్లు వచ్చాయి. ‘ద బాన్సీష్ ఆఫ్ ఇనిషెరిన్’ డైరెక్టర్ మార్టిన్ మెక్ డోనా 9 శాతం ఓట్లు, ‘టార్’ చిత్ర దర్శకుడు టాడ్ ఫీల్డ్ 7 శాతం ఓట్లు సంపాదించారు.
వాస్తవానికి ఓటింగ్ లో ఈ ఆరుగురు దర్శక దిగ్గజాలూ మంచి శాతాలు సాధించారు. ఉత్తమ డైరెక్టర్ విభాగంలో నామినేషన్లు సంపాదించే వారిలో తప్పకుండా వీరి పేర్లు ఉంటాయని అంటున్నారు. అందులోనూ టాప్ లో దూసుకెళ్తున్న రాజమౌళి పేరు కూడా ఉంటుందని బల్ల గుద్ది చెబుతున్నారు. సర్వేలు ఫలించి.. అభిమానుల ప్రార్థనలు నిజమై.. రాజమౌళికి బెస్ట్ డైరెక్టర్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ లభిస్తే అది కచ్చితంగా ఓ చరిత్ర అవుతుంది.