Cine Workers Protest : షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్
ఇటీవల చిత్ర పరిశ్రమ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వివిధ కార్మిక సంఘాలు హైదరాబాద్ లోని ఫిలిం ఫెడరేషన్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. నాలుగేళ్లుగా వేతనాలను పెంచట్లేదంటూ నిరసనకు దిగారు. ఈ విషయంపై సినీ నిర్మాతల మండలి స్పందిస్తూ సినీ కార్మికులు సడన్ గా సమ్మెకు వెళ్లటం సరికాదని, తాము చర్చలకు సిద్దంగా ఉన్నామని, బేషరతుగా షూటింగ్ లకు రావాలని ఆదేశించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ వివాదం మరింత ముదరగా, తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోక్యంతో సద్దుమణిగింది. తలసానితో భేటీ అనంతరం సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కళ్యాణ్ మాట్లాడుతూ మంత్రి తలసాని జోక్యంతో ఈ రోజు మీటింగ్ పెట్టుకున్నామని, రేపటి నుంచి యధావిధిగా షూటింగ్స్ జరుగుతాయని, రేపు కో ఆర్డినేషన్ కమిటీ డిసైడ్ చేసిన తరువాత జీతాలపై క్లారిటీ వస్తుందని, ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ ద్వారా సాలరీస్ ఇస్తామని వెల్లడించారు. రేపు ఛాంబర్, ఫెడరేషన్ దిల్ రాజు అధ్యక్షతన సమావేశం అవుతుందని కళ్యాణ్ పేర్కొన్నారు. ఆ తరువాత ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ వేతనాల సమస్యపై మీటింగ్ పెట్టుకున్నామని, వేతనాలు పెంచడానికి ఛాంబర్ సభ్యులు ఒప్పుకున్నారని, పెంచిన వేతనాలు రేపటి నుంచి అమలులోకి వస్తాయని, రేపు కమిటీ వేతనాలు డిసైడ్ చేస్తాయని, రేపటి నుంచి షూటింగ్స్ కొనసాగుతాయని ప్రకటించారు.