Balakrishna: ఎట్టకేలకు వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ
Balakrishna Responds: చాలాకాలం నుంచి వివాదాస్పదంగా మారిన నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై ఎట్టకేలకు ఆయన స్పందించారు. వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో భాగంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతున్న సమయంలో అక్కినేని తొక్కినేని అనే పదాలు దొర్లాయి. అయితే నందమూరి బాలకృష్ణ అక్కినేని నాగేశ్వరరావుని కావాలని కించపరిచే విధంగా మాట్లాడారంటూ అక్కినేని అభిమానులు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. ఆయన క్షమాపణలు చెప్పకపోతే తాము నిరసన కార్యక్రమాలు సైతం చేపడతామని హెచ్చరించారు. అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
అయితే తాజాగా హిందూపురంలో పర్యటిస్తున్న నందమూరి బాలకృష్ణ ఎట్టకేలకు ఈ వ్యాఖ్యలపై స్పందించారు. తాను కావాలని అక్కినేని నాగేశ్వరరావుని కించపరిచే విధంగా మాట్లాడలేదని తాను ప్రసంగిస్తున్న సమయంలో యాదృచ్ఛికంగా ఆ మాట వచ్చింది తప్ప ఆయనను కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని అన్నారు. తాను అక్కినేని నాగేశ్వరరావును బాబాయ్ అని పిలుస్తానని ఆయన కూడా తన పిల్లలకంటే ఎక్కువగా నా మీద ప్రేమ చూపించే వాళ్ళని నందమూరి బాలకృష్ణ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అలాగే పొగడ్తలకు పడిపోకూడదు పొంగిపోకూడదు అని ఆయన నుంచే నేర్చుకున్నానని ఈ సందర్భంగా బాలకృష్ణ చెప్పుకొచ్చారు.
ఇక నాకు 60 సంవత్సరాలు అంటే వాడికి దబిడి దిబిడే అంటూ సరదాగా పేర్కొన్న ఆయన సేవా కార్యక్రమాలు చేయాలంటే అధికారంలోనే ఉండాల్సిన అవసరం లేదని, కానీ అభివృద్ధి చేయాలంటే మాత్రం అధికారం ఉండాలని అన్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అని ఆయన విమర్శించారు. చదువుకుంటేనే తనను సినిమాల్లోకి రావాలని మా తండ్రి ఎన్టీఆర్ అన్నారు. ఒకవేళ సినిమాల్లో నేను రాణించ లేకపోతే చదువుకున్నా కాబట్టి ఉద్యోగమైనా చేసుకోగలనని ఆయన ఆ షరతు విధించారని అన్నారు. ఇక నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలపై అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ కూడా స్పందించారు ఇలా పెద్దలను అగౌరవపరచడం అంటే మనల్ని మనం కించపరచుకోవడమే అంటూ వారు కామెంట్లు చేశారు.