Balagam Movie: బలగం సినిమా కథపై దర్శకుడు వేణు క్లారిటీ, గడ్డం సతీష్ పై మండిపాటు
Balagam Movie Director clarity on the Story of the Movie
బలగం చిత్ర కథ వివాదంపై దర్శకుడు వేణు స్పందించాడు. బలగం కథ తనదేనని గడ్డం సతీష్ అనడం హాస్యాస్పదంగా ఉందని వేణు అన్నారు. గడ్డం సతీష్ రాసిన కథ తాను చదవలేదని దర్శకుడు వేణు తెలిపారు. బలగం సినిమా కథ తెలంగాణ చరిత్రలో ఉన్న సంప్రదాయమని వేణు గుర్తుచేశారు. పిట్ట ముట్టుడు సంప్రదాయం ఎవరి సొత్తు కాదని వేణు స్పష్టం చేశారు. తెలుగు సంప్రదాయాలు, సంస్కృతిపై ఒక్కొక్కరు ఒకలా స్పందిస్తారని వేణు అన్నారు.
గడ్డం సతీష్ తాము రూపొందించిన బలగం సినిమాను అభాసుపాలు చేసేలా ప్రయత్నం చేస్తున్నారని, ఇది సబబు కాదని వేణు ఆవేదన వ్యక్తం చేశారు. రచయితల సంఘాన్ని సతీష్ గడ్డం ఎందుకు సంప్రదించలేదని వేణు నిలదీశారు. నిర్మాత దిల్ రాజు ముందుకు వచ్చి ఈ సినిమాను తీయకపోతే తెలంగాణ సంస్కృతిలో ఈ పాయింట్ ప్రపంచానికి ఎలా తెలిసేదని ప్రశ్నించారు. బలగం సినిమా వల్ల ఎన్నో మంచి కథలు రాబోతున్నాయని వేణు ఆశాభావం వ్యక్తం చేశారు. సతీష్ చేస్తున్న ప్రయత్నాలను చిల్లర ప్రయత్నాలని దర్శకుడు వేణు కొట్టిపారేశారు.
బలగం సినిమాకు దిల్ రాజు ముందు ఉండటం వల్ల తెలంగాణ సంస్కృతి ఏంటో తెలిసిందని వేణు తెలిపారు. బలగం కథ మా కుటుంబంలో జరిగిన కథ అని వేణు అన్నారు. బలగం మా నాన్న చనిపోయినప్పుడు మెదిలిన కథ అని వేణు గుర్తుచేశారు.నేను రాసింది కథ కాదని ప్రజల జీవితాల్లో జరిగే అనేక పరిణామాలని వేణు తెలిపారు. ఆరేళ్లు ఈ కథపైనే పరిశోధన చేశానని కూడా వేణు తెలిపారు.