Avatar 2: ఇండియాలో అవతార్-2 సరికొత్త రికార్డు
Avatar 2 New Record: జేమ్స్ కామెరూన్ రూపొందించగా ఇటీవల విడుదలైన విజువల్ వండర్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ మూవీ ఇండియాలో సరికొత్త రికార్డు సృష్టించింది. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ సినిమా ఇండియాలో ఇప్పటి వరకు రూ.368 కోట్లు వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్ (రూ.367 కోట్లు) రికార్డును ‘అవతార్ బ్రేక్ చేసింది. అవతార్-2 మూవీ రూ. 400 కోట్ల మార్కును చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించింది. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమరూన్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రోజురోజుకు రికార్డులు సృష్టిస్తోంది.
సినిమా విడుదలై 6 వారాలు గడిచినా ప్రేక్షకులు సినిమా చూసేందుకు థియేటర్లకు చేరుకుంటున్న క్రమంలో ఈ రికార్డు సృష్టించింది. ఇక అలాగే ఈ చిత్రం అద్భుతమైన బాక్సాఫీస్ కలెక్షన్లతో 2 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ప్రవేశించింది.ఈ సినిమా వసూళ్లు ఇలాగే పెరుగుతూ పోతే, మరి కొద్ది రోజుల్లో ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా అవతరిస్తుందని అంటున్నారు. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ 2 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరడం కూడా ప్రత్యేకమే ఎందుకంటే ఇప్పటివరకు కేవలం 6 సినిమాలు మాత్రమే అలాంటి రికార్డు సృష్టించగలిగాయి.’అవతార్: ది వే ఆఫ్ వాటర్’, ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’, ‘అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్’, ‘స్టార్ వార్స్: ద ఫోర్స్ అవేకెన్స్’, ‘అవతార్’ మరియు ‘టైటానిక్’ ఈ రికార్డు సృష్టించాయి.ఆసక్తికరంగా, ఈ జాబితాలో జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన మూడు చిత్రాలు ఉన్నాయి. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’, ‘అవతార్’ మరియు ‘టైటానిక్’ చిత్రాలకు జేమ్స్ కామెరూనే దర్శకుడు.