ట్రైలర్ టాక్: 30 ఏళ్ళైనా పెళ్లికాని ఓ ప్రసాద్ కథ
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. విద్యా సాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా నేడు ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. 30 ఏళ్లు దాటినా పెళ్లికాని అల్లం అర్జున్ కి ఒక పల్లెటూరిలో నివసించే హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అవుతుంది. వేర్వేరు ప్రాంతాలు వేర్వేరు కులాలకు చెందిన హీరోహీరోయిన్ల వివాహం సెట్ అయింది అనుకోలోపు అమ్మాయి ఒక్కసారిగా తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి బాంబ్ పేల్చుతోంది. దీంతో అప్పటివరకు అల్లం అర్జున్ పెళ్లిపై పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరవుతాయి.
అసలు ముందు పెళ్లికి ఒప్పుకున్న హీరోయిన్.. పెళ్లి వద్దు అనడానికి కారణం ఏంటి..? 33 ఏళ్ళు వచ్చిన అల్లం అర్జున్ కు చివరకు పెళ్లి జరుగుతుందా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మాస్ కా దాస్ గా మాస్ విశ్వరూపాన్ని చూపించిన విశ్వక్.. ఈ సినిమాలో ఎంతో మెచ్యూర్డ్ గా కనిపించాడు. పెళ్లి తప్ప జీవితంలో పెద్దఅచీవ్ మెంట్ లేదని బంధువులు ఎత్తిచూపుతుంటే.. ఆ బాధను దిగమింగి పైకి నవ్వుతూ కనిపించే పాత్రలో విశ్వక్ నటన అద్భుతం.రొమాన్స్ అండ్ ఎమోషన్స్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మే 6 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమాతో విశ్వక్ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.