Veera Simha Reddy: వీర సింహా రెడ్డి మీద ఏపీ ప్రభుత్వం ఫోకస్..ఏం చేస్తారబ్బా?
AP Govt Targets Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారు. తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నా ఆయనతో సఖ్యత గానే వ్యవహరిస్తూ తన కుమార్తెను ఆయన కుమారిడికిచ్చి పెళ్లి కూడా చేశారు. ఇక రెండు దఫాలుగా బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా నిలబడుతూ గెలుస్తూ వస్తున్నారు. ఒకపక్క రాజకీయాలు చేస్తూనే మరో పక్క సినిమాలు చేస్తున్న ఆయన తాజాగా వీర సింహారెడ్డి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీ విడుదల అయిన ఈ సినిమాకి మొదటి అటు నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. బాలకృష్ణ అభిమానులు మాత్రం హిట్ అని చెప్పుకుంటున్నారు ఆ సంగతి అలా ఉంచితే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అనేక పంచ్ డైలాగ్ లు ఉన్నాయి.
నందమూరి బాలకృష్ణ పాత్రధారితోని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నట్లుగా ఉన్న ఈ డైలాగులు ఇప్పుడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. అభివృద్ధి గురించి నందమూరి బాలకృష్ణ మాట్లాడిన డైలాగులు అధికారంలో ఉన్నవారు వెధవలు అని అర్థం వచ్చేలా చేసిన కామెంట్లు ఇప్పుడు అన్ని కూడా ప్రభుత్వ రాడార్ లోకి వెళ్ళాయని అంటున్నారు. నిజానికి ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు తన తండ్రి పేరుని హెల్త్ యూనివర్సిటీకి మార్చిన విషయం మీద కౌంటర్ వేశాడు అనుకున్నారు కానీ ఆయన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా అనేక కామెంట్లు చేసిన విషయం సినిమా రిలీజ్ అయిన తర్వాతే బయటికి వచ్చింది. తాజాగా ఈ విషయం ప్రభుత్వం పెద్దల దృష్టికి వెళ్లడంతో వారు ఒక అధికారుల బృందాన్ని సినిమా చూసి నివేదిక ఇవ్వమని కోరినట్లు తెలుస్తోంది. దీంతో సదరు అధికారుల బృందం విజయవాడలో గురువారం అర్ధరాత్రి ఒక స్పెషల్ షో చూసి ఈ సినిమాలో డైలాగులు కావాలని ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లు గానే ఉన్నాయని నివేదిక సిద్ధం చేశారు.
ఏ ఏ డైలాగులు వాడారు? ఎవరిని ఉద్దేశించి డైలాగులు వాడారు? అని అన్ని విషయాలను సిద్ధం చేసి ప్రభుత్వ పెద్దలకు రిపోర్ట్ అందించారని తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది/ నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో జరిగే సినిమాకు టికెట్ రేటు పెంచి అమ్ముకుంటామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కోరగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అనుమతించింది. 20 రూపాయల మేర రేటు పెంచి అమ్ముకునే విధంగా అవకాశం కల్పించింది కూడా.
రాజకీయ ప్రత్యర్థి అని కూడా చూడకుండా ఇంతలా వాళ్లకి మంచి చేస్తుంటే మా ప్రభుత్వాన్నే టార్గెట్ చేస్తూ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారా అంటూ ప్రభుత్వ పెద్దలు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయాన్ని కూడా కొందరు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ప్రభుత్వం తరఫున ఏమీ చేయలేకపోతే పార్టీ తరఫున ఏమైనా చేయొచ్చా? అనే విషయం మీద కూడా తర్జన భర్జనలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం ఎలాంటి మలుపులు తిరగబోతుంది అనేది కాలమే నిర్ణయించాలి మరి.