Oscar Nominations: RRR సినిమాకు ఆస్కార్ అవార్డు లభించే ఛాన్స్ ఉందా?
95th Academy Awards Nominations will be announced tomorrow
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన RRR సినిమా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని అలరించింది. ఎన్టీఆర్, రాంచరణ్ నటించిన RRR సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. విడుదలైన ప్రతిచోటా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఆస్కార్ అవార్డుల రేసులో నిలిచింది. నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న RRR సినిమా తప్పకుండా ఆస్కార్ గెలుచుకుంటుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు, సినీ విశ్లేషకులు, సినీ విమర్శకులు సైతం RRR సినిమాకు ఆస్కార్ అవార్డు గ్యారంటీ అని జోస్యం చెబుతున్నారు.
ఆస్కార్ అవార్డుల బరిలో ఏ ఏ సినిమాలు నిలిచాయనే విషయం రేపు తేలనుంది. నామినేషన్ల జాబితా రేపు విడుదల కానుంది. మొత్తం 24 కేటగిరీల్లో అవార్డులకు చెందిన నామినేషన్ల లిస్టు వెల్లడి కానుంది. భారత కాల మాన ప్రకారం రేపు రాత్రి 7 గంటలకు నామినేషన్ల జాబితా ప్రకటించనున్నారు. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో జరిగే కార్యక్రమంలో ఆస్కార్ నామినేషన్ల లిస్టు ప్రకటిస్తారు. నటులు రిజ్ అహ్మద్, అల్లిసన్ విలియమ్స్ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నారు.
RRR సినిమా ఏ ఏ కేటగిరీల్లో నామినేట్ అయ్యే ఛాన్స్ ఉందనే విషయంలో కూడా పలువురు విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఆస్కార్ అవార్డులు మొత్తం 24 కేటగిరీలకు ఇస్తారు. అందులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ డైరెక్టర్ విభాగాల్లో RRR నామినేట్ అయ్యే ఛాన్స్ ఉందని పలువురు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
మొత్తం 24 కేటగిరీల్లో ఆస్కార్ అవార్డులు ప్రకటించనున్నారు. నామినేషన్లు పొందిన సినిమాలలో ఏ ఏ సినిమాలు ఆస్కార్ దక్కించుకోనున్నాయనే విషయం మార్చి 12న తేలనుంది. ఆ రోజే ఆస్కార్ అవార్డుల ప్రదానం జరగనుంది. ప్రఖ్యాత టెలివిజన్ హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని హోస్ట్ చేయనుంది.
RRR సినిమా కనీసం నాలుగైదు కేటగిరీల్లోనైనా నామినేషన్లు సాధిస్తే, అందులో కనీసం ఒక్క విభాగానికైనా అవార్డు వచ్చే ఛాన్స్ ఉంటుంది. రేపు సాయంత్రం 7 గంటలకు అవార్డుల విషయంలో మరింత క్లారిటీ రానుంది. ఎన్ని విభాగాల్లో నామినేషన్ సాధించిందనే విషయం స్పష్టం కానుంది. అసలు నామినేషన్ల జాబితాలో కూడా ఉంటుందా ఉండదా అనే విషయం కూడా రేపు తేలనుంది.