Prem Rakshith: నా పాటకు ఆస్కార్ రావడం ఎంతో ఆనందంగా ఉంది
Choreographer Prem Rakshith Talking About RRR: నాటు నాటుతో పాటతో ప్రపంచాన్ని ఊపేసేలా చేశారు రామ్ చరణ్, ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఈ సాంగ్ ఆస్కార్ అందుకొని దేశ గౌరవాన్ని పెంచేసింది. ఇక ప్రపంచం మొత్తం డ్యాన్స్ వేసిన చరణ్, తారక్ ను మాత్రమే చూస్తోంది కానీ, వారికి ఆ స్టెప్పులు నేర్పించిన కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ను మాత్రం పట్టించుకున్నదే లేదు. మొదటిసారి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ తన సాంగ్ కు ఆస్కార్ రావడంపై స్పందించాడు. నేడు అమెరికా నుంచి ఇండియా వచ్చిన ఆయన మీడియా తో మాట్లాడుతూ.. “ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ రావటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.. మొదటగా నాకు వీసా రాలేదు రాజమౌళి గారు చాలా ప్రయత్నం చేశారు. కేవలం ఐదు రోజులకు మాత్రమే వీసా ఇచ్చారు. అందుకే పదో తారీఖున అమెరికా వెళ్లాను.
ఇక స్టేజ్ మీద నాటు నాటు పాటకి వారు డ్యాన్స్ చేయటం నిజంగా నా అదృష్టం. నేను కంపోజ్ చేసిన స్టెప్స్ ఆస్కార్ స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేస్తుంటే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఈ సాంగ్ కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎంతో హార్డ్ వర్క్ చేశారు. ఇక డైరెక్టర్ రాజమౌళి గారితో నా జర్నీ ఇలా చెప్పడం కష్టం, అదో పెద్ద సిరీస్ లాంటిది. నా పాటకి ఆస్కార్ వచ్చింది అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నా లైఫ్ లో మొదటిసారిగా ఒక పాట కోసం రెండు నెలలు హార్డ్ వర్క్ చేశాను” అని చెప్పుకొచ్చాడు. మరి ఈ పబ్లిసిటీతో ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.