Agent Teaser: వైల్డ్ ఏజెంట్ గా అఖిల్ విశ్వరూపం..
Akhil Agent Teaser Released: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తరువాత అక్కినేని అఖిల్ నటిస్తున్న చిత్రం ఏజెంట్. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఎకె ఎంటర్టైన్మెంట్స్ మరియు సురేందర్2సినిమా పతాకాలపై అనిల్ సుంకర ‘ఏజెంట్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ మరియు శాండిల్ వుడ్ స్టార్ కిచ్చా సుదీప్ కలిసి తమిళం మరియు కన్నడ భాషలలో ఈ టీజర్ ను లాంచ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. మమ్ముట్టి కీలక పాత్ర పోషించిన జాతీయ భద్రతా సంస్థ అధిపతి మహదేవ్ దృష్టికోణంలో టీజర్ కట్ చేసిన విధానం బావుంది. ఏజెంట్ అత్యంత అపఖ్యాతి పాలైన క్రూరమైన దేశభక్తుడని.. అతన్ని పట్టుకోవడం అసాధ్యమని.. తన డెత్ నోట్ ఇప్పటికే రాసి ఉందని చెప్తాడు. అలానే అఖిల్ లవ్ ఇంట్రెస్ట్ సాక్షి వైద్య అతన్ని ‘వైల్డ్ సాలే’ పిలవడం విశేషం. ఇక చివర్లో అఖిల్ నట విశ్వరూపం చూపించేశాడు. అఖిల్ తన యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్ లో సరికొత్తగా కనిపించాడు. చేతిలో గన్ పట్టుకొని స్టైల్ గా వచ్చిన తీరు అదిరిపోయింది. టీజర్ తోనే సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాడు దర్శకుడు. మరి ఈ సినిమా తో అఖిల్ మరో హిట్ ను అందుకోబోతున్నాడా ..? లేదా అనేది చూడాలి.