Adah Sharma:ఇండస్ట్రీలో ఎవరి టైమ్ ఎప్పుడు మొదలవుతుందో ఎవరూ చెప్పలేరు. ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోతుంటాయిక్కడ.
Adah Sharma:ఇండస్ట్రీలో ఎవరి టైమ్ ఎప్పుడు మొదలవుతుందో ఎవరూ చెప్పలేరు. ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోతుంటాయిక్కడ. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా వాళ్లు ఏమీ సాధించలేక కనుమరుగవ్వొచ్చు.. తొలి సినిమాతో వండర్స్ క్రియేట్ చేసిన వాళ్లూ ఉన్నారు. రాత్రికి రాత్రే అద్భుతాలు సృష్టించిన వాళ్లూ ఉన్నారు. అలాంటి అద్భుతమే ఇటీవల జరిగింది. అదే `ది కేరళ స్టోరీ` (The kerala story). అదా శర్మ ప్రధాన పాత్రలో సుదీప్తో సేన్ రూపొందించిన ఈ సినిమా బాకర్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది.
ఈ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకొచ్చిన హీరోయిన్ అదాశర్మ. `ది కేరళ స్టోరీ` అదాశర్మ కెరీర్‌ని ఒక్కసారిగా మార్చేసింది. 15 ఏళ్ల కెరీర్లో ఆమెకు తొలి బ్లాక్ బస్టర్‌ని అందించి స్టార్ గా నిలబెట్టింది. మే 5న విడుదలైన ఈ సినిమా దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతూ హాట్ టాపిక్‌గా మారింది. బాక్సాఫీస్ వద్ద సైలెంట్‌గా మొదలైన ఈ సినిమా ఓ ప్రభంజనంగా మారి రూ.100 కోట్ల మైలు రాయిని దాటేసింది. సైలెంట్‌గా విడుదలై ఈ స్థాయి వసూళ్లతో ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురి చేస్తోంది.
ఈ రేంజ్ బ్లాక్ బస్టర్‌ని అదాశర్మ దక్కించుకోవడానికి 15 ఏళ్లు పట్టింది. 2008లో విక్రమ్ భట్ రూపొందించిన `1920` అనే హారర్ థ్రిల్లర్‌తో అదాశర్మ పరిచయమైంది. వరుసగా హిందీలో మూడు సినిమాలు చేసినా పెద్దగా రాణించలేకపోయింది. 2014లో తెలుగులో అయినా అదృష్టం కలిసి వస్తుందని పూరి, నితిన్‌ల కాంబినేషన్లో రూపొందిన `హార్ట్ ఎటాక్`లో నటించింది. ఆ తరువాత బన్నీ, త్రివిక్రమ్‌ల సన్నాఫ్ సత్యమూర్తి, సాయి ధరమ్ తేజ్ `సుబ్రమణ్యం ఫర్ సేల్`, అది సాయికుమార్ `గరమ్`, అడివి శేష్ `క్షణం` వంటి సినిమాల్లో నటించింది. సినిమాలు హిట్ అనిపించుకున్నా అదాశర్మకు పెద్దగా ఉపయోగపడలేదు.
హిందీలో అయినా స్టార్ డమ్ వస్తుందని ఆశిస్తే అక్కడా నిరాశే ఎదురైంది. హసీతో ఫసీ, కమెండో 2 వంటి సినిమాలు మంచి విజయాల్ని సాధించిన అదాశర్మకు ఊరటనిచ్చాయి. అయితే `ది కేరళ స్టోరీ` మాత్రం అదాశర్మను రాత్రికి రాత్రే స్టార్‌ని చేసింది. 15 ఏళ్లుగా తనకు దక్కని స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని అందించింది. గ్లామర్ క్యారెక్టర్లు చేస్తూ వస్తున్న అదాశర్మ చిన్న ఛేంజ్ కోసం ఏడాది క్రితం అంగీకరించిన సినిమా `ది కేరళ స్టోరీ`. నటనకు ఆస్కారం ఉంటుందని భావించి చేసిన ఈ సినిమా అదాశర్మను బాలీవుడ్లో స్టార్‌గా నిలబెట్టింది.
దేశ వ్యాప్తంగా రిలీజ్ కు ముందు నుంచే రాజకీయ దుమారాం రేపుతున్న `ది కేరళ స్టోరీ` బాక్సాఫీస్ వద్ద కూడా అదే జోరుని చూపిస్తూ రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతోంది. ఊహించని విధంగా అతి తక్కువ రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కుని దాటేయడంతో అంతా విస్తూ పోతున్నారు. ఉత్తరాదిలో వసూళ్ల సునామీని సృష్టిస్తున్న ఈ సినిమా అలియాభట్ నటించిన `గంగుబాయి కతియావాడి` వసూళ్లని అధిగమించడంతో ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ సక్సెస్ నేఫథ్యంలో అదాశర్మ ఇక చేయబోయే సినిమాలని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని, అలా చేస్తేనే బాలీవుడ్లో స్టార్‌డమ్‌ని కాపాడుకోగలదని విశ్లేషకులు చెబుతున్నారు.