తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల షెడ్యూల్ నేడు విడుదల చేసింది టీటీడీ. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకునే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా షెడ్యూల్ విడుదల చేసింది.
Tirumala: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల షెడ్యూల్ నేడు విడుదల చేసింది టీటీడీ. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకునే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా షెడ్యూల్ విడుదల చేసింది. దర్శన టికెట్ల విడుదల తేదీ ఆదివారం వచ్చినట్లయితే వాటిని మరుసటి రోజు విడుదల చేస్తారు. ప్రతినెలా 18 నుంచి 20వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. 20 నుంచి 22వ తేదీ వరకు లక్కీడిప్ లో టికెట్లు పొందిన వాళ్లు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవలతోపాటు వర్చువల్ సేవాటికెట్లను 21వ తేదీన విడుదల చేస్తారు. శ్రీవాణి, ఆంగ ప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు 23వ తేదీన విడుదలవుతాయి. అదే విధంగా రూ.300 దర్శన టికెట్ల కోటాను 24న, తిరుపతిలో గదుల కోటాను 25న, తిరుమలలో గదుల కోటాను 26న విడుదల చేయడం జరుగుతుందని ఓ ప్రకటనలో తెలిపింది.
తిరుమల లో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. నిన్న స్వామివారిని 79,207 మంది భక్తులు దర్శించుకోగా..తలనీలాలు 41 ,427 మంది భక్తులు సమర్పించగా.. హుండీ ఆదాయం 3.19 కోట్లు ఆదాయంగా వచ్చిందని టీటీడీ తెలిపింది.