తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి సర్వదర్శనం కోసం 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
Tirumala: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి సర్వదర్శనం కోసం 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. దీంతో టైంస్లాట్ టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి మూడు గంటల పడుతుండగా, టోకెన్ రహిత భక్తులకు 20 గంటల సమయం పడుతోంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
శ్రీవారిని శుక్రవారం రికార్డుస్థాయిలో 81,833 మంది భక్తులు దర్శించు కున్నారు. వీరిలో 33,860 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వేసవి సెలవులు, విద్యార్థులకు పరీక్ష ఫలితాల విడుదల నేపథ్యంలో భారీగా తిరుమలకు వస్తున్నారు. ఈ క్రమంలో చాలా రోజుల నుంచి తిరుమల కొండ కిటకిటలాడుతోంది. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, రోడ్లు, అన్నప్రసాద భవనం, లడ్డూ వితరణ కేంద్రం, అఖిలాండం, బస్టాండ్, కల్యాణకట్ట వంటి ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కాలినడక మార్గాల్లో భక్తుల సందడి అధికంగా ఉంది. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.