ఢిల్లీలో జరిగిన శ్రద్ధవాకర్ హత్య ను మరచిపోకముందే అలంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఈ మధ్య మనిషిని చంపి శరీరాన్ని ముక్కలు చేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా కేరళలో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. కోజికోడ్ జిల్లాలో సిద్ధిఖ్ అనే హోటల్ యజమానిని ఓ యువజంట అత్యంత దారుణంగా చంపారు.
Kerala: ఢిల్లీలో జరిగిన శ్రద్ధవాకర్ హత్య ను మరచిపోకముందే అలాంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఈ మధ్య మనిషిని చంపి శరీరాన్ని ముక్కలు చేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా కేరళలో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. కోజికోడ్ జిల్లాలో సిద్ధిఖ్ అనే 58 ఏళ్ల ఓ హోటల్ యజమానిని 18 ఏళ్ల ఫర్హానా, 22 ఏళ్ల శిబిల్.. అత్యంత కిరాతకంగా హత్య చేశారు. సిద్ధిఖ్ ఉన్న హోటల్ గదిలోనే మరో గదిని తీసుకున్న వీరిద్దరూ అతన్ని అంతం చేశారు. తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ట్రాలీ బ్యాగ్‌లో బయటకు తరలించారు. అక్కడి నుంచి పాలక్కడ్ జిల్లా అట్టప్పాడి పాస్ సమీపంలోని అడవి ప్రాంతంలో విసిరేశారు. అయితే వీరిద్దరిని శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు చెన్నై పోలీసులు..ఆతర్వాత కేరళ పోలీసులకు అప్పగించారు.
సిద్ధిఖ్ వ్యాపార నిమిత్తం కుటుంబసభ్యులకు దూరంగా కోజికోడ్ జిల్లాలోనే నివాసం ఉంటున్నాడు. సిద్ధిఖ్‌కు అతడి కుమారుడు చాలాసార్లు ఫోను చేసినా అతని మొబైల్ స్విచ్ఆఫ్ వచ్చింది. అదే సమయంలో అతడి ఫోనుకు తండ్రి కార్డుతో రూ.లక్ష డ్రా చేసినట్లుగా ఏటీఎం నుంచి మెస్సేజులు వచ్చాయి. ఏదో జరిగిందనే అనుమానంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సిద్ధిఖ్ హత్యకు గురైనట్లు గుర్తించారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా అడవి ప్రాంతంలో పడి ఉన్న సిద్దిఖ్ శరీర భాగాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి పంపించారు. హత్య జరిగిన సమయంలో హోటల్ గదిలోనే ఉన్నట్లు అనుమానిస్తున్న పాలక్కడ్‌కు చెందిన మరో వ్యక్తిని కూడా పోలీసుల అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శిబిల్.. సిద్ధిఖ్ నిర్వహిస్తున్న హోటల్లో కొన్నిరోజులు పనిచేశాడు. 15 రోజులు పనిచేసిన తర్వాత శిబిల్ ప్రవర్తన నచ్చకపోవడంతో అతడ్ని సిద్ధిఖ్ ఉద్యోగంలో నుంచి తొలగించాడు. ఈ విషయంలో సిద్ధిఖ్ పై కోపం పెంచుకుని హత్య చేశాడా..? లేక వేరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.