Uber Taxi Tax crisis: భారీగా పన్నులు ఎగ్గొట్టిన ఉబెర్..ఇండియాలోనూ కిల్ స్విచ్
Uber Taxi Tax crisis: ప్రముఖ టాక్సీ సంస్థ ఉబెర్ పన్నుల ఎగవేతకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సంస్థ ప్రవేశించిన ప్రతీ దేశంలోని రాజకీయ నేతలను తమకు అనుకూలంగా మార్చుకొని టాక్సీ చట్టాలను, కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చేలా ఒత్తిడి చేస్తుందన్న సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ట్యాక్సుల ఎగవేత, ఉబెర్ డ్రైవర్ల పై విచారణ తదితర విషయాలను బయటపడకుండా ఉండేందుకు, వివరాలు బయటకు పొక్కకుండా ఉండేందుకు టెక్నాలజీని వినియోగించుకొని అన్ని సర్వర్లను ఒకేసారి ఆఫ్ చేసి కిల్ స్విచ్ విధానానికి ఒడిగడుతోందని ది ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సంస్థ పేర్కొన్నది.
ఇండియాలో కూడా 2015 ఫిబ్రవరి 10 వ తేదీన సర్వర్లను ఒకేసారి ఆఫ్ చేసి కిల్ స్విచ్ చేసింది. 2014 లో ఢిల్లీలో ఉబెర్ సంస్థ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ సంస్థపై రెండు నెలల నిషేధం విధించారు. ఇక ఫ్రాన్స్ లోనూ ఆ సంస్థ ఆగడాలు దారుణంగా ఉన్నాయి. ప్రస్తుత ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మన్యుయేల్ మెక్రోన్ 2014 నుంచి 2016 వరకు ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉబెర్ పైరవీలకు లొంగిపోయినట్లు కన్సార్టియం సంస్ధ తెలియజేసింది. ఉబెర్ అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని కన్సార్టియం పేర్కొన్నది.