TCS: ఐటీ ఉద్యోగులకు టీసీఎస్ శుభవార్త, త్వరలోనే లక్షలాది ఉద్యోగాలు
TCS Company to Hire Over 1.25 Lakh in the coming months
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ ఐటీ ఉద్యోగుల పాలిట వరంగా మారింది. చాలా టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉధ్వాసన పలుకుతున్న వేళ టీసీఎస్ సంస్థ కొత్తవారికి ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధమయింది. ఏకంగా లక్షా పాతిక వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించుకుంది. గత ఏడాది క్వార్టర్ 3 నివేదికను పరిశీలించిన అనంతరం ఉద్యోగుల సంఖ్య తక్కువ ఉన్నట్లు గమనించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో నియామకాల జోరు పెంచనుంది.
కంపెనీలో ఉద్యోగుల సంఖ్య తక్కువుగా ఉన్నట్లు టీసీఎస్ గుర్తించింది. రానున్న రోజుల్లో 1,25,000 నుంచి 1,50,000 మందిని కొత్తగా నియమించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడాది ఎక్కువ మంది ఉద్యోగుల కారణంగా ఎంతో లాభపడ్డామని టీసీఎస్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన రాజేశ్ గోపీనాథ్ తెలిపారు. గత ఏడాది డిసెంబర్ నాటికి టీసీఎస్ సంస్థలో 6,13,974 మంది ఉద్యోగులు ఉన్నారు. 2197 మంది ఉద్యోగులు సంస్థ నుంచి తప్పుకున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలు ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి. ఆర్ధిక అస్థిరత కారణంగా కాస్ట్ కటింగ్‌లు చేస్తున్నాయి. వీలైనంత ఎక్కువ మందిని ఇంటికి పంపుతున్నాయి. ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఉద్యోగుల శ్రేయస్సును గాలికి వదిలేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీసీఎస్ వెల్లడించిన నిర్ణయం ఐటీ రంగంలో ప్రవేశించాలని ఆసక్తి కలిగిన లక్షలాది నిరుద్యోగులకు ఊరటనిస్తుందనడంలో సందేహం లేదు.