Air India to Women India: ఎయిర్ ఇండియాలో వారే అత్యధికం
Air India to Women India: పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. విమానయాన రంగంలోనూ మహిళలు దూసుకుపోతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎయిర్ ఇండియా సంస్థ కొన్ని విషయాలను ప్రకటించింది. విమానయాన సంస్థల్లో అత్యధిక మంది మహిళలు ఉన్న సంస్థ ఎయిర్ ఇండియానేని టాటా సంస్థ ప్రకటించింది. ఎయిర్ ఇండియా సంస్థలో 40 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారని, ఎయిర్ ఇండియాలో 1825 మంది పైలెట్లు ఉండగా అందులో 275 మంది మహిళలు ఉన్నట్లు టాటా సంస్థ తెలియజేసింది.
ఈ ఏడాది మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా సిబ్బందితో కూడిన 90 దేశీయ, అంతర్జాతీయ ఎయిర్ ఇండియా విమానాలను నడుపుతున్నట్లు టాటా సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 1 నుండి మహిళా ఎయిర్ సర్వీసెస్ అందుబాటులోకి వచ్చినట్లు టాటా సంస్థ తెలియజేసింది. ఈ విమానాల్లో ఎయిర్ సిబ్బందితో పాటు కాక్‌పిట్ సిబ్బంది కూడా మహిళలేనని తెలియజేసింది. ఎయిర్ ఇండియాకు సంబంధించిన అన్ని విభాగాల్లోనూ మహిళలు పనిచేస్తున్నట్లు ఆ సంస్థ యాజమాన్యం తెలియజేసింది. సంస్థలో ఉద్యోగినులు వారి విధులను అద్భుతంగా నిర్వహిస్తున్నారని, ఎయిర్ ఇండియా సంస్థ స్పష్టం చేసింది.