Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Markets Today Update: దేశీయ స్టాక్ మార్కెట్ల రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఈ రోజు మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. కీలక కౌంటర్లలో కొనుగోళ్లు, ఆశాజనకంగా ఉన్న కార్పొరేట్ ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు దేశీయ సూచీల సెంటిమెంటును పెంచింది. ఉదయం ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లకు తొలి గంటలోనే కొనుగోళ్ల మద్దతు లభించింది. నేడు వెలువడనున్న ఫెడ్ నిర్ణయాల నేపథ్యంలో సూచీలకు తీవ్ర ఊగిసలాట తప్పదని విశ్లేషకులు భావించినప్పటికీ.. మార్కెట్లు మాత్రం అందుకు భిన్నంగా కదలాడాయి. రూపాయి కోలుకోవడం మార్కెట్లు రాణించడానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 548 పాయింట్లు పెరిగి 55,816కి చేరగా.. నిఫ్టీ 158 పాయింట్లు ఎగబాకి 16,641కి చేరుకుంది. సన్ ఫార్మా 3.39 శాతం లాభ పడగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.76 శాతం, ఎల్ అండ్ టీ 2.67 శాతం, టీసీఎస్ 2.33 శాతం, ఏసియన్ పెయింట్స్ 2.31 శాతం లాభపడి టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఈ రోజు భారతి ఎయిర్ టెల్ -1.32 శాతం నష్టపోగా.. కొటక్ మహీంద్రా బ్యాంక్ -0.17 శాతం, ఎన్టీపీసీ -0.10 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ -0.09 శాతం, రిలయన్స్ -0.05 శాతం నష్టాలతో టాప్ లూజర్స్‌గా నిలిచాయి.