దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. మధ్యాహ్న సమయంలో భారీగా లాభపడ్డ సూచీలు.. ఆ తర్వాత కొనుగోళ్ల ఒత్తిడితో స్వల్ప లాభాల్లోకి జారుకున్నాయి.
Stock market: ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు (Stock market).. చివరికి స్పల్ప లాభాలతోనే ముగిశాయి. ట్రేడింగ్ (Trading) ప్రారంభమైన కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న సూచీలు.. ఆ తర్వాత కొనుగోళ్ల మద్ధతుతో మళ్లీ లాభాల్లో పయనించాయి. మధ్యాహ్న సమయంలో సూచీలు భారీ లాభాల్లో కొనసాగాయి. చివరికి ఇన్వెస్టర్లు (Investers) అమ్మకాలు జరపడంతో.. స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. అటు 46వ వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) చేసిన ప్రకటనలు ఇన్వెస్టర్లను ఆకట్టుకోలేకపోయాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 110 పాయింట్లు లాభపడి 64,996 వద్ద ముగిసింది. అలాగే ఎన్ఎస్ఈ నిప్టీ (NSE Nifty) 40 పాయింట్ల లాభంతో 19,306 వద్ద క్లోజ్ అయింది. డాలరుతో రూపాయి మారకపు విలువ రూ. 82.62 వద్ద ఉంది.
ఇక సెన్సెక్స్‌లో రిలయన్స్, హిండాల్కో ఇండస్ట్రీస్, ఏబీబీ లిమిటెడ్, సీజీ పవర్ ఇండస్ట్రీస్ సొల్యూషన్స్, అల్ట్రాటెక్ సిమింట్, ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పోరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, శ్రీ సిమెంట్, ఫినోలెక్స్ కేబుల్స్, లక్ష్మి మిషన్ వర్క్స్ షేర్లు నష్టాలతో ముగిశాయి. అదే సమయంలో కోల్ ఇండియా, బీపీసీఎల్, రిలయన్స్ ఇన్ఫ్రా, టాటా స్టీల్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, డీబీఎల్, ఎన్‌హెచ్‌పీసీ, హావెల్స్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషన్ అల్యూమినియం కంపెనీ, ఏసీసీ లిమిటెడ్, ది రామ్‌కో సిమెంట్, అంబుజా సిమెంట్, బీహెచ్ఈఎల్, ఎస్కేఎఫ్ ఇండియా, ఎల్టీ, టాటా కెమికల్స్ షేర్లు లాభాలతో ముగిశాయి.