WTW report: భారత ఉద్యోగులకు శుభవార్త, ఈ ఏడాది 10 శాతం పెరగనున్న జీతాలు
Salaries in India to rise 10% in 2023, says WTW Report
భారత ఉద్యోగుల జీతాలు ఎలా ఉండనున్నాయనే విషయం ఓ సర్వే ద్వారా వెల్లడయింది. ఈ ఏడాది భారతీయుల జీతాలు 10 శాతం పెరగనున్నాయని WTW నివేదిక వెల్లడించింది. గ్లోబల్ ఎడ్వైజరీ, బ్రోకింగ్ సొల్యూషన్స్ సంస్థ శాలరీ బడ్జెట్ ప్లానింగ్ పేరుతో ఓ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో భారతదేశంలో ఉద్యోగుల జీతాలు 10 శాతం పెరగనుందని తేలింది.
చైనాలో 6 శాతం, వియత్నాం 8 శాతం, ఇండోనేషియా 7 శాతం, హాంగ్ కాంగ్ 4 శాతం, సింగపూర్ దేశంలో 4 శాతం జీతాలు పెరగనున్నాయి. భారతదేశంలోని ఉద్యోగులు జీతాలు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ఎక్కువ పెరుగుదలను చూడనున్నాయని ఆ సర్వే తేటతెల్లం చేసింది.
కరోనా మహమ్మారి వీర విహారం చేసిన సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో, అన్ని రంగాల్లో జీతాలలో కోత పడింది. ఆదాయాలు పూర్తిగా పడిపోవడంతో కంపెనీలు జీతాలను తగ్గించేశాయి. గత ఏడాది నుంచి పరిస్థితుల్లో మార్పు మొదలయింది. భారతదేశంలో ఉద్యోగుల జీతాలు 9.8 శాతం పెరిగాయి. ఈ ఏడాది 10 శాతం పాటు జీతాలు పెరగనున్నట్లు తెలుస్తోంది.
ఫైనాన్సియల్ సర్వీసెస్, టెక్ మీడియా, గేమింగ్ రంగాలతో పాటు ఫార్మసుటికల్, బయో టెక్నాలజీ, కెమికల్ రంగాలలో వృద్ధి కనిపించనుంది. వీటితో పాటు రిటైల్ రంగంలో కూడా జీతాల పెరుగుదల కనిపించనుంది.