Lay Off Issue in World: ఎవర్ని కదిలించినా లేఆఫ్ గురించే… ఎందుకిలా
Lay Off Issue in World: ప్రపంచంలో ఆర్థిక మాంద్యం రోజురోజుకు పెరిగిపోతున్నది. దీని ప్రభావం అనేక రంగాలపై పడింది. ముఖ్యంగా ఆర్థిక మాంధ్యం దెబ్బకు ద్రవ్యోల్భణం క్రమంగా పెరగుతున్నది. అమెరికా వంటి దేశాల్లో సైతం ద్రవ్యోల్బణం పెరిగింది. దీంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రజల జీవన వ్యయం పెరిగిపోవడం మొదలుపెట్టింది. జీవన వ్యయం పెరిగిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఆర్థిక మాంద్యం దెబ్బకు ప్రజల స్థితిగతులు ఒక్కసారిగా తలక్రిందులయ్యాయి. కరోనా నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకు మాంద్యం మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టింది.
మాంద్యం ఛాయలు కనిపించిన వెంటనే ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందిన బడా సంస్థలు భారం తగ్గించుకోవడం మొదలుపెట్టాయి. ఫిబ్రవరి నెలలో 17,400 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇప్పటి వరకు బడా సంస్థలు ఉద్యోగులను తొలగిస్తుండగా, ఈ బాటలో యాహు, బైజూస్, గోడాడి, గిట్‌హబ్, ఈబే, ఆటోడెస్క్, ఓఎల్ఎక్స్ వంటి సంస్థలు కూడా ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టాయి. ఈ ఏడాది జనవరి నెలలో గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష మంది ఉద్యోగులను వివిధ సంస్థలు తొలగించాయి. ఇందులో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, సేల్స్‌ఫోర్స్ వంటి సంస్థలు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించాయి. అంతర్జాతీయంగా నెల రోజుల వ్యవధిలో లక్షమందిని తొలగించడం ఒక రికార్డ్. ట్విన్ టవర్స్ కూలిపోయిన సమయంలోనూ, అంతకు ముందు 2008లో వచ్చిన మాంద్యం సమయంలో కూడా ఈ స్థాయిలో ఉద్యోగాలు కొల్పోలేదు.
ప్రపంచవ్యాప్తంగా 2023లో 340 కార్పోరేట్ కంపెనీలు 1.10 లక్షల మంది ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్ వెబ్‌సైట్ తెలియజేసింది. తరుముకొస్తున్న మాంద్యం ఒకటైతే, టెక్నాలజీ పరంగా మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రావడం కూడా ఇందుకు ఒక కారణం. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత నలుగురు ఉద్యోగులు చేసే పనిని ఒక్కరే చేసే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అందుబాటులోకి వచ్చింది. దీనిని అనేక కంపెనీలు ఇప్పటికే ఇంటిగ్రేట్ చేసుకుంటున్నారు. దీంతో ఉద్యోగుల అవసరం పెద్దగా ఉండకపోవచ్చని కంపెనీలు అభిప్రాయ పడుతున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అందుబాటులోకి రావడంతోనే ఉద్యోగుల తొలగింపు అన్నది పూర్తిగా వాస్తవం కాకపోయినప్పటికీ, కొంతమేర ఇదికూడా ఒక కారణంగా ఉంటుందని మాత్రమే చెప్పవచ్చు. కంపెనీపై భారం పడుతుందన్నప్పుడు మొదటగా సదరు కంపెనీలు చేసేపని ఉద్యోగులను తొలగించుకోవడమే. ఇలా ఉద్యోగులను తొలగించుకోవడం వలన నెలకు సాలీనా కొంత మిగులు కనిపిస్తుంది. ఈ మొత్తాన్ని కంపెనీలు వివిద పనులకు వినియోగించుకుంటాయి. సాధారణంగా అన్ని కంపెనీలు చేసేదే ఇది.
కాకపోతే, మాంద్యం కూడా దీనికి తొడవ్వడంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నారు. జనవరి నెలలో 288 కార్పోరేట్ కంపెనీలు ప్రతిరోజూ 3300 మంది ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్ వెబ్‌సైట్ పేర్కొన్నది. ఉద్యోగులను తొలగించాలని భావించిన సదరు కంపెనీలు పనితీరును, ఉద్యోగి ప్రవర్తనా విధానాన్ని, ఉద్యోగి శైలిని కూడా నిశితంగా గమనిస్తున్నాయి. ఏ మాత్రం తేడా కనిపించినా నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి. ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ ఉద్యోగులకు సైతం లేఆఫ్‌లు తప్పలేదు. ఫినాన్సియల్, హ్యుమన్ రీసోర్స్ డిపార్ట్‌మెంట్లలో పనిచేస్తున్న 2 వేల మంది ఉద్యోగులను తొలగించింది.
లేఆఫ్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం, 2022 డిసెంబర్ నాటికి మొత్తం 1,54,336 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కొల్పోయారు. 2023 జనవరి నుండి ఇప్పటివరకు 1.10 లక్షల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కొల్పోయారు. మొత్తంమీద గతేడాది నుండి ఇప్పటి వరకు 2.64 లక్షల మంది ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయినట్లు లేఆఫ్ వెబ్‌సైట్ తెలియజేసింది. అయితే, ఉద్యోగాలు కొల్పోతున్నవారిలో చాలా వరకు నాన్ టెక్నికల్ ఉద్యోగులే ఉన్నారని, టెక్నికల్ ఉద్యోగులతో ఇబ్బందులు తక్కువగా ఉంటాయని లేఆఫ్ వెబ్ తెలిజేసింది. ఐటీ ఉద్యోగుల సంఖ్య 8 శాతం మేర పెరిగినట్లు లేఆఫ్ వెబ్ తెలియజేసింది. ఆర్థిక మాంద్యం నుండి ప్రపంచం కోలుకునే వరకు ఈ తొలగింపులు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.