Akasa Air: భారత్ లో కొత్త ఎయిర్ వేస్.. టికెట్ ధర ఎంతంటే?
Rakesh Jhunjhunwala’s Akasa Air Opens Bookings For Flights: భారత విమానయాన రంగంలో కొత్త విమానయాన సంస్థ విమానాలు త్వరలో ఎగరబోతున్నాయి. రాకేష్ ఝున్‌జున్‌వాలా పెట్టుబడితో ఆకాశ ఎయిర్ విమానాల ప్రారంభంపై అందరి దృష్టి ఉంది. కంపెనీ తన మొదటి విమానాన్ని గత నెలలోనే సిద్దం చేయడంతో అప్పటి నుండి ప్రజలు ఆకాశ ఎయిర్ టేకాఫ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అలాంటి వారి కోసం నిరీక్షణ ముగిసింది. ఆగస్టు 07 నుంచి కంపెనీ వాణిజ్య విమాన సర్వీసులను ప్రారంభించబోతోంది. ఆకాసా ఎయిర్ ఇప్పటికే డిజిసిఎ నుండి విమానాలను నడిపేందుకు అనుమతిని పొందింది.
డిజిసిఎ నుండి ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ పొందిన 8వ దేశీయ కంపెనీగా ఆకాశా ఎయిర్ నమోదయింది. ఆగస్టు 07న ముంబై-అహ్మదాబాద్ రూట్లో తొలి విమానాన్ని నడపబోతున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 28 విమానాలకు టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. ఆకాశ ఎయిర్ ఇప్పటికే వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని భావించింది, అయితే విమానాల డెలివరీలో జాప్యం కారణంగా, ఇప్పుడు కంపెనీ ఆగస్టు నుండి కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. ముంబై-అహ్మదాబాద్ మధ్య రూ. 4,314 నుండి టికెట్ ధర ప్రారంభం కానుండగా బెంగళూరు నుండి కొచ్చికి టికెట్ల ధర రూ. 3,483 నుండి ప్రారంభం కానుంది.